ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 18: మతతత్వ కారు మేఘాలు దేశాన్ని కమ్మేస్తుంటే మౌనంగా ఉండడం సరైనది కాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని న్యూఎరా స్కూల్లో ఆదివారం జరిగిన ఇంజం సీతారామయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. తరగతి గదిలో ప్రపంచాన్ని నిర్మించే సృష్టికర్తలైన ఉపాధ్యాయులు కులమత ఆధిపత్యాలను తిప్పికొట్టే శక్తులుగా ఈనాటి తరాన్ని తయారు చేయాలని కోరారు. దేశంలో జరగాల్సిన మార్పులు జరగకపోగా దేశం కులమతాల పేరున విభజించబడుతుంటే చూస్తూ ఊరుకోవడం మంచిది కాదని అన్నారు. మతోన్మాద శక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐక్యంగా కలిసి ఉన్న సమాజ స్థితిగతులు అస్థిరమవుతున్నప్పుడు దాన్ని చక్కబెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయ లోకంపై ఉందన్నారు. గ్రామాల్లో అందరూ సామూహికంగా జరుపుకునే పీర్ల పండుగలోనూ మతాన్ని చూసే దశకు రావడం దుర్దశ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్మరణ సభలో ప్రొఫెసర్ సైదులు, న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు, కవులు సీతారాం, ప్రసేన్, కొండపల్లి పవన్, పలు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ నాయకులు, సామాజిక సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.