రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన
భద్రాచలం, మార్చి 13: ఆదివారం సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులకు మూడు గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలో భాగంగా అంతరాలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించగా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణంలో 135 జంటలు పాల్గొన్నాయి.
దేవస్థానానికి విరాళాలు..
శ్రీ సీతారామచంద్రస్వామి ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం కోసం ఖమ్మానికి చెందిన పల్లెర్ల కృష్ణమూర్తి, చంద్రకళ దంపతులు రూ.1,00,111 విరాళంగా అందజేశారు. అలాగే బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన తాళ్ల మురళీకృష్ణ భార్గవి, అఖిలాండేశ్వరి దంపతులు స్వామి వారి నిత్యన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళంగా అందజేశారు. వైరా వాస్తవ్యులు బండారు అనంతాచారి, ఉమారాణి కూడా అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళంగా అందజేశారు.