ఒప్పంద అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు
క్రమబద్ధీకరణ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
జిల్లాలో జూనియర్లో 149మంది, డిగ్రీలో 32మందికి లబ్ధి
ఆనందోత్సాహాల్లో అధ్యాపకులు
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 13 : ఎన్నో సంవత్సరాలు వేడుకున్నారు… మరెన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు… కాళ్లు అరిగేలా తిరిగారు.. తమ బాధలను ఎలా చెప్పాలో అలా వ్యక్తపరిచారు. ఏంచేసినా ఆంధ్రా పాలకులు కనికరం చూపలేదు కదా కనీసం స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.. టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి మాట ఇచ్చింది. మాట ప్రకారమే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఖమ్మం జిల్లా పరిధిలో ఇంటర్ జూనియర్ కళాశాలల్లో 149మంది, డిగ్రీ కళాశాలల్లో 32మంది అధ్యాపకుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.
ప్రవేశాల నుంచి మూల్యాంకనం వరకు…
ఖమ్మం జిల్లాలోని 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 20 ఏళ్లుగా 164మంది ఒప్పంద అధ్యాపకులు సేవలందిస్తున్నారు. కళాశాలల్లో ప్రవేశాల కోసం క్యాంపెయిన్ చేయడం మొదలు, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం తదితర ముఖ్యమైన కార్యక్రమాలతో అటు విద్యార్థులు, ప్రిన్సిపాళ్లకూ సమన్వయకర్తగా సేవలు చేస్తున్న వీరి జీవితం రూ.7500 వేతనంతో మొదలైంది.
వేతనాలు ఇలా…
ఒకే పనికి ఒకే రకమైన వేతనం చెల్లించాలన్న ప్రాథమిక సూత్రానికి భిన్నంగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో విభిన్నమైన వ్యవస్థ ఉంది. టీఎస్పీఎస్సీతోపాటు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల ద్వారా పనిచేసే రెగ్యులర్ అధ్యాపకులతోపాటు పిరియడ్‌కు 390రూపాయల వంతున నెలకు 72 పీరియడ్లకు మించకుండా గరిష్టంగా రూ.28,080 వేతనంతో 63మంది , కనీస వేతన స్కేల్లోని కనీస వేతనం రూ.54,220పైన కరువుభత్యాన్ని కలిపి పొందుతున్న అధ్యాపకులు 13మందితో పాటు 149మంది ఆ స్కేల్లోని కనీస వేతనం రూ.54,220తోనూ పనిచేస్తున్నారు. 2001-02లో రూ. 7500 వేతనంతో ప్రారంభమైన వీరి జీవితం 2011జూన్ నెల నుంచి రూ.18000 కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జనవరి 2017 నుంచి రూ.27వేలకు పెంచారు. జూన్ 2017 నుంచి రూ.37,100 వేతనంగా చెల్లిస్తూ ఉండగా ఇటీవలే జూన్ 2021 నుంచి రూ.54,220 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వేతనాలు పెంచింది కేసీఆరే…
క్రమబద్ధీకరణ కంటే ముందు ఒప్పంద అధ్యాపకుల వేతనాలను రెగ్యూలర్ అధ్యాపకుల వేతనాలకు సమానంగా పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. కళాశాలల్లో ఒప్పంద పద్ధతిలో అధ్యాపకులుగా పనిచేసే వారు రెగ్యులర్ వారికి ఏ మాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తారు. వారు న్యాయపరమైన డిమాండ్‌తో జీతాలు పెంచండి మహాప్రభో అంటూ వేడుకున్నారు. ఏ ఒక్కరు స్పందించలేదు. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే వాటి పరిష్కరానికి కృషి చేశారు. గత 20 సంవత్సరాల శ్రమ దోపిడీ నుంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. వేతనాలు పెంచి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో 346మందికి ప్రయోజనం జరిగింది. ఖమ్మం జిల్లాలో 199 మందికి, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో 147 మందికి లబ్ధి జరిగింది.
తొలగిన అడ్డంకులు..
తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఒప్పంద ఉద్యోగులందరి సర్వీస్‌లను క్రమబద్ధీకరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో జీవో 16 జారీ చేసింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడంతో ఆటంకం ఏర్పడింది. ఇటీవల కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 9న అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి సర్వీస్‌లను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు అధ్యాపకులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
మా ఆశలు ఫలించనున్నాయి
రెగ్యులర్ అవుతామనే ఆశతో పనిచేస్తున్నాం. మా ఆశలు ఫలించనున్నందుకు ఆనందంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా కుటుంబ ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మాకు మరింత బాధ్యతగా పనిచేసే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది.
– కె. శ్వేత, కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ, నయాబజార్ కళాశాల, ఖమ్మం
కేసీఆర్‌కి రుణపడి ఉంటాం
ఉన్నత చదువులు చదివి పొట్టకూటి కోసం ఇన్నేళ్లు పనిచేసిన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది. మా బతుకులకు భరోసానిచ్చింది, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రుణపడి ఉంటాం.
– ఎం.రమేశ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు, బోనకల్ జూనియర్ కళాశాల