ఖమ్మం ఏఎంసీలో జోరుగా క్రయవిక్రయాలు
సీజన్ ఆరంభంలో మందగమనం
ప్రస్తుతం రోజుకు 30- 40 వేల బస్తాల రాక
క్వింటాకు రూ.18 వేల వరకు ధర
వైరస్ కారణంగా దిగుబడి తగ్గినా చేతికొచ్చిన పంటకు మంచి డిమాండ్
ఖమ్మం వ్యవసాయం, మార్చి 12 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజారకం మిర్చి ధరల జోరు కొనసాగుతూనే ఉంది. పత్తి, అపరాల పంటలతో పాటు మిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభంలో మిర్చి క్వింటాకు రూ.15,375 పలికిన ధర ఇప్పుడు రూ.18 వేలకు చేరుకుంది. ఖమ్మం మార్కెట్‌కు జిల్లా నుంచే కాక భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు భారీగా మిర్చి తీసుకువస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద మార్కెట్లుగా భావించే వరంగల్, గుంటూరు మార్కెట్లతో పోల్చితే ఖమ్మం మార్కెట్లో ఈసారి మిర్చికి మంచి ధర లభిస్తున్నది.
తేజా రకానికి క్రేజ్..
మిర్చి ఉత్తత్తిలో దేశం మొదటి స్థానంలో ఉండగా చైనా రెండో స్థానంలో ఉంది. చైనాలో తెలంగాణలో పండించిన మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ సాగవుతున్న తేజా రకం పంట నాణ్యమైనది కావడమే. కాయ సహజసిద్ధమైన ఎరుపు రంగులో ఉండడం, ఎక్కువ కాలం నిల్వ ఉండే శక్తి ఉండడం, విదేశాల్లో పండే మిర్చికంటే ఈ రకం కాయలకు ఘాటు ఎక్కువగా ఉండడం విదేశాల్లో డిమాండ్‌కు కారణం.
విదేశాలకు ఎగుమతి..
ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి 60-70శాతం తేజా రకం మిర్చి చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం స్టెమ్ కటింగ్ (తొడిమ సగభాగం కటింగ్), స్టెమ్‌లెస్ కటింగ్ (పూర్తిగా తొడిమలు తొలగించడం) గ్రేడింగ్ చేసి తమిళనాడులోని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుల ద్వారా ప్రత్యేక కంటైనర్లలో విదేశాలకు తరలివెళ్తున్నది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏటా ఎగుమతుల ద్వారా రూ.3 వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందని ఓ అంచనా. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 40-50వేల ఎకరాల్లో తేజా రకం మిర్చి సాగవుతుంది. రైతులు ఈసారి ఏకంగా 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మిర్చి తోటలకు వైరస్ ఎక్కువ ఆశించడంతో దిగుబడులు బాగా తగ్గాయి. చేతికొచ్చిన పంటకు మద్దతు ధర పలుకుతుండ డంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
రోజుకు వేలాది బస్తాల రాక
ప్రస్తుతం మార్కెట్‌కు సీజన్లో రోజుకు 30-40 వేల బస్తాలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 39 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా వీటిలో 44 లక్షల బస్తాలు నిల్వ చేసే అవకాశం ఉన్నది. మార్కెటింగ్‌శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం కోల్ట్‌స్టోరేజీల్లో కేవలం 4 లక్షల బస్తాలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఏటా రైతులు ఫిబ్రవరి నుంచే కోల్డ్‌స్టోరేజీల్లో పంట నిల్వచేసుకొని మంచి ధరలు వచ్చిన సమయంలో మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకానికి పెట్టేవారు. ఈసంవత్సరం పంటకు రికార్డు స్థాయి ధరలు పలుకుతుండటంతో చేతికి వచ్చిన పంటను తక్షణం విక్రయిస్తున్నారు. వైరస్ మూలంగా కొంతమేర దిగుబడి తగ్గినప్పటికీ పంటకు మంచి ధర వస్తుండడంతో వెంటనే విక్రయిస్తున్నారు.
క్రయవిక్రయాలపై నిరంతర సమీక్ష..
మార్కెట్‌కు పంట తీసుకువస్తున్న రైతులకు మంచి ధర ఇవ్వాలనే ఉద్దేశంతో నిరంతరం ఖరీదుదారులు, కమిషన్ వ్యాపారులతో సమీక్షిస్తున్నాం. ఇటు వ్యాపారులు, అటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. రెండు నెలల నుంచి మార్కెట్లో మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. రైతులు ఆశించిన మేర ధర లభిస్తున్నది. రాష్ట్రంలో పండించిన మిర్చికి జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
– డౌలే లక్ష్మీప్రసన్న, ఖమ్మం ఏఎంసీ చైర్మన్
నిలకడగా మిర్చి ధరలు..
ఖమ్మం ఏఎంసీలో మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈసారి పంట దిగుబడి తగ్గడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతులు ఉన్నా, లేకున్నా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. వీరికి తోడు చైనాకు చెందిన ఫ్యాక్టరీల యాజమాన్యాలు మిర్చి ప్రాసెసింగ్ చేస్తున్నాయి. ఈసారి దిగుబడులు తగ్గినప్పటికీ మార్కెట్‌కు పంట తెచ్చిన రైతులకు మద్దతు ధర లభిస్తున్నది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
– రుద్రాక్ష మల్లేశం, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ,ఖమ్మం ఏఎంసీ