టేకులపల్లి, డిసెంబర్ 11: టేకులపల్లి మండలంలో శనివారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. టేకులపల్లి ఎస్సై శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు గ్రామ పంచాయతీ పరిధి శాంతినగర్ గ్రామానికి చెందిన ధరావత్ బాలాజీనాయక్-విజయల పెద్ద కుమారుడు ధరావత్ అశోక్(26) ఖమ్మంలో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన అశోక్‌ను శనివారం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డుకు చెందిన గుగులోత్ ప్రేమ్‌కుమార్(కిట్టు) ఫోన్‌చేసి క్రాస్‌రోడ్డుకు రమ్మని పిలిచాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన అశోక్ ఎంత సమయానికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆదివారం ఉదయం 9 గంటలకు అశోక్ తండ్రి బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 11గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు అశోక్ మృతదేహాన్ని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు ప్రాథమిక పాఠశాల, పంచాయతీ కార్యాలయం గ్రౌండ్లో పోలీసులు గుర్తించారు. మెడ, రెండు చేతుల మణికట్టు వద్ద కత్తితో కోసి ముఖంపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, టేకులపల్లి, ఇల్లెందు సీఐలు ఇంద్రసేనారెడ్డి, బానోత్ రాజు, ఎస్సైలు భూక్యా శ్రీనివాస్, రంజిత్, డాగ్ స్కాడ్, క్లూస్ టీం సాయంతో ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కొడుకు దారుణంగా హత్యకు గురికావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అశోక్ మృతితో శాంతినగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు.