ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్
కొత్తగూడెంలో జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మెగా వైద్య శిబిరం
కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ప్రారంభించిన పీహెచ్ డైరెక్టర్
శిబిరంలో 6,348 మందికి వైద్య పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పుట్టిన ఊరికి సేవచేసేందుకే నాన్న పేరుతో వైద్య శిబిరం ఏర్పాటు చేశానని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ పేర్కొన్నారు. తన తండ్రి పేరుతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సేవ చేసేందుకే కొత్తగూడెంలో ట్రస్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేవలం వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా.. వారికి జబ్బులు నయం అయ్యేదాకా మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. స్థోమత లేని పేద పిల్లలు తమ ఉన్నత చదువులను ఆపకుండా తాను అండగా ఉంటానన్నారు. ఏజెన్నీ ప్రాంతమైన కొత్తగూడెంలో వైద్య శిబిరానికి చాలా తక్కువ మంది వస్తారనుకున్నానని, కానీ చాలామంది వచ్చారని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మరి కొద్ది రోజుల్లో మరో క్యాంపును కూడా ఏర్పాటు చేస్తానన్నారు.
కరోనా సమయంలోనూ ఆదుకున్నారు: కలెక్టర్ అనుదీప్
కరోనా కష్టకాలంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. తగినంత వ్యాక్సిన్ సరఫరా చేసి జిల్లా వాసులను ఆదుకున్నారని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ గుర్తుచేశారు. కొత్తగూడెంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమమన్నారు. భద్రాద్రి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడానికి మన జిల్లా వాసిగా ఆయన ఎంతో సహకారం అందించారని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, టీఆర్ఎస్ మధిర నాయకుడు బొమ్మెర రామూర్తి, డాక్టర్ పోటు వినోద్, కౌన్సిలర్లు కొల్లాపూరి ధర్మరాజు, పరమేశ్ యాదవ్ పాల్గొన్నారు.