కూసుమంచి, నవంబర్ 25: ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు మొక్కుబడిగా నడిచేవి. నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షలాగానే ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రులపై దృష్టి సారించారు. వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలను బలోపేతం చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వైద్యసేవల్లో పారదర్శకత తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా వైద్యారోగ్యశాఖ జిల్లావ్యాప్తంగా ఉన్న 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రస్తుతం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఆసుపత్రుల్లో రోజురోజుకూ ఔట్ పేషెంట్ (ఓపీ) పెరుగుతున్నది. ప్రతి పీహెచ్సీ, సబ్ సెంటర్లో అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంటున్నది. గతంలో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరుగుతున్నాయి. వీటిలోనూ సాధారణ ప్రసవాలే ఎక్కువగా నమోదవుతుండడం విశేషం. కొవిడ్ వంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు అండగా నిలిచాయి. కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుకున్నాయి. పీహెచ్సీల్లో సిబ్బంది అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తున్నారు. వైద్యాధికారులు, వైద్యసిబ్బంది నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కూసుమంచి పీహెచ్సీకి గతంలో రోజుకు ఓపీ 25 కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 130- 150కు పెరిగింది.
సీసీ కెమెరాల బిగింపు ఇలా..
వైద్య సేవల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు వైద్యారోగ్యశాఖ ప్రతి పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సేవలను పర్యవేక్షించేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. వైద్యాధికారి, ల్యాబ్, ఫార్మసీ గదుల్లో సాంకేతిక నిపుణులు సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. అవి ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయి. దీంతో జిల్లావైద్యారోగ్యశాఖ, రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కార్యాలయాల నుంచి ఉన్నతాధికారులు వైద్యసేవలను పర్యవేక్షించవచ్చు.
సీసీ కెమెరాల ఏర్పాటు మంచిదే..
ప్రభుత్వ దవాఖానల్లో సీసీ కెమెరాల ఏర్పాటు మంచిదే. వైద్యసేవలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. వైద్యులు, సిబ్బంది మరింత బాధ్యతతో ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు. మెరుగైన వైద్యసేవలు అందితే ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తారు. క్రమంగా ఓపీ పెరుగుతుంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.
– శ్రీనివాస్, డీడీవో, కూసుమంచి