నగరంలోని ‘డైట్’ కేంద్రంలో నిర్వహణ
ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు క్లాసులు
తొలి బ్యాచ్‌లో 60 మంది టీచర్ల ఎంపిక
పరీక్ష ఉత్తీర్ణులైతే డిజిటల్ సర్టిఫికెట్ల పంపిణీ
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11: విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ అమలు చేయనున్నది.. దీనిలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో 1-8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపె ట్టనున్నది.. దీనిలో భాగంగా విద్యాశాఖ ప్రతి ఉపాధ్యాయుడికి బోధనలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.. ఈ నెల 14న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్లో శిక్షణను ప్రారంభిం చనున్నారు. 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు 60 మంది ఉపాధ్యా యులు తొలివిడతలో శిక్షణ పొందనున్నారు..
సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియం అమలుకానున్నది. తొలివిడతగా 1- 8వ తరగతి వరకు బోధన జరుగనున్నది. దీనిలో భాగంగా రాష్ట్రవిద్యాశాఖ ప్రతి ఉపాధ్యాయుడికి బోధనలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 14న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్లో శిక్షణను ప్రారంభించనున్నారు. 15వ తేదీ నుంచి విద్యాశాఖ వారం రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నది.
‘డైట్’ కళాశాలలో నిర్వహణ..
నగరంలోని టేకులపల్లి జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లో ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియం బోధనలో శిక్షణ జరుగనున్నది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శిక్షణకు అనువుగా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది ఉపాధ్యాయులు ఒకేసారి శిక్షణకు హాజరయ్యేలా బెంచీలను సిద్ధం చేశారు. శుక్రవారం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ట్రైల్ రన్‌ను పరిశీలించారు. ఉన్నాతాధికారులతో కలిసి శిక్షణపై ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు.
వారం రోజుల పాటు శిక్షణ..
తొలివిడతలో ప్రాథమిక పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులకు శిక్షణ జరుగనున్నది. దీనిలో భాగంగా మొదటి షెడ్యూల్‌కు జిల్లావ్యాప్తంగా 60 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. వీరిలో 30 మంది మెంటార్స్, మరో 30 మంది శిక్షణ పొందే ఉపాధ్యాయులు. వీరికి వారం రోజుల పాటు ఆన్లైన్లో శిక్షణ ఉంటుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో అన్నిజిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు ఒకేసారి శిక్షణ ఇవ్వనున్నారు. అప్పటికప్పుడే ఉపాధ్యాయులను సందేహాలను నివృత్తి చేయనున్నారు. శిక్షణ అనంతరం వారికి వర్క్షీట్లు అందించనున్నారు. ఆయా అంశాలపై ఉపాధ్యాయులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు విద్యాశాఖ డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
ముగ్గురు రిసోర్స్పర్సన్ల నియామకం..
ఇంగ్లిష్ మీడియంలో బోధనపై శిక్షణకు రిసోర్స్పర్సన్లుగా జగదీశ్, సంక్రాంతి రవికుమార్, కృష్ణ ఎంపికయ్యారు. వీరు ఎస్సీఈఆర్టీలో శిక్షణ పొందారు. వీరి పర్యవేక్షణలో 1-8వ తరగతి విద్యార్థులకు బోధించే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడతలో 60 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మండలాల్లోని మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. విద్యాశాఖ ప్రతి పాఠశాలలో డిజిటల్ బోధనకు సామగ్రి సమకూర్చింది. మండలంలోని ఒక పాఠశాలను ఎంపిక చేసి ఇదే మండలంలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల ఏప్రిల్ లోపు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేయనున్నది.