అడవుల సంరక్షణ ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులపై వలస ఆదివాసీ, గొత్తికోయలు దాడులకు తెగబడుతున్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు సర్వే నిర్వహిస్తుంటే.. మరోవైపు దాడులు చేస్తుండడం కలవరానికి గురిచేస్తున్నది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వలసొచ్చిన ఆదివాసీలు, గొత్తికోయలు అడవులను ఆక్రమిస్తున్నారు. చెట్లను నరికి వేసి పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులపై దాడులు చేస్తున్నారు. చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ప్లాంటేషన్‌లో మంగళవారం గొత్తికోయలు ఆవులు, మేకలు మేపుతుండగా.. అడ్డుకున్న ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావును దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో విషాదాన్ని నింపింది.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ)
శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
ఖమ్మం, నవంబర్ 22(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): గొత్తి కోయల దాడిలో దుర్మరణం చెందిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ మంత్రులు అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయం 8.45గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాఫ్టర్లో బయల్దేరి 10 గంటలకు ఖమ్మం మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 10.20కు ఈర్లపూడి చేరుకొని ప్రభుత్వ లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగేలా చూస్తారు. శ్రీనివాసరావు మృతికి మంత్రి అజయ్‌కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసరావు మృతి పట్ల టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సంతాపం తెలిపారు.