భద్రాచలం, నవంబర్ 21: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామవారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం గోదావరి మాతకు వైభవంగా నదీ హారతులు సమర్పించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ ఫుణ్యాహవాచన నిర్వహించారు. గోదావరి మాతకు అష్టోత్తర శత నామార్చనలు జరిపారు. అనంతరం గోదావరి మాతకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమలు, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో నదులను పూజించడం ఒక భాగమన్నారు.
పంచభూతాలను ఆరాధించడం ఎప్పటి నుంచో ఉందన్నారు. మానవ జీవితంలో నీరు ఎంతో ఆవశ్యకమని తెలిపారు. అనంతరం పులిహోరను గోదావరి మాతకు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో బానోత్ శివాజీ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.