డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
ఖమ్మం వ్యవసాయం, మార్చి 11 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ప్రస్తుతం 50 బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయని, మార్చి తరువాత మరో ఎనిమిది కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసి మరింతమంది రైతులకు సేవలందిస్తామని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. పాలకవర్గం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కేవలం ఏడాది వ్యవధిలోనే నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టించినట్లు పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలు అందిస్తూనే వసూళ్లలో జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన శతాబ్ది డిపాజిట్ పథకానికి మంచి ఆదరణ వచ్చిందన్నారు. గతంలో బ్యాంక్ టర్నోవర్ రూ.2,300 కోట్లు కాగా ప్రస్తుతం రూ.2,600 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. 48 సొసైటీలను బహుళార్థక సేవల కేంద్రాలుగా గుర్తించి, ఒక్కో సొసైటీకి రూ.2 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. రెండేళ్లలో 76మందికి ఉద్యోగోన్నతులు కల్పించామన్నారు. రుణాల వసూళ్లలో ప్రతిభ కనపరచిన బ్యాంక్ మేనేజర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతోపాటు, వారి పిల్లలకు విదేశి విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ఉంటుందని, ఈ నెల 28లోపు చెల్లించి ప్రయోజనం పొందాలని సూచించారు. బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేసిన, సహకరించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో చైర్మన్‌తోపాటు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అట్లూరి వీరబాబు పాల్గొన్నారు.