భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో ఈసారి విస్తారంగా పత్తి సాగైంది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మరోవైపు క్వింటా పత్తికి ధర రూ.9,500 వరకు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సారి ధరలు ఎక్కువగా ఉన్నాయి. సుజాతనగర్, జూలూరుపాడు మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు తరలివస్తున్నాయి. క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 9.64 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నాలుగేళ్ల నుంచి రైతులు పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఏకంగా 1.75 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. గిట్టుబాటు ధరలు ఏటా పెరుగుతుండడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కనబరస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో సాగుకు ఢోకా లేకుండాపోయింది. పత్తి సాగుకు తక్కువ పెట్టుబడులు అవుతుండడంతో రైతులూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపడుతున్నారు. పత్తి తీత పనులు ప్రారంభం కావడంతో కూలీలకే కాదు ఆటోలు, ట్రాలీ యజమానులకూ గిరాకీ పెరిగింది. కూలీలు తీసిన పత్తిని రైతులు మార్కెట్లకు తరలిస్తున్నారు. ఆరు నెలల పాటు ఆటో, ట్రాలీ యజమానులకు డిమాండ్ ఉంటుంది. సబ్యార్డులు ఉన్న దూరాన్ని బట్టి ట్రాలీ యజమానులు చార్జీలు వసూలు చేస్తున్నారు.
రైతులు పంట విక్రయించేందుకు ప్రభుత్వం సుజాతనగర్ మండలంలోని మంజిత్ కాటన్ మిల్లు, కారేపల్లిలోని శ్రీలక్ష్మి కాటన్ మిల్లు, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం అనుశ్రీ కాటన్ మిల్లు, అశ్వాపురంలోని శ్రీలక్ష్మి కాటన్ మిల్లులను కేటాయించింది. మిల్లుల్లో యాజమాన్యాలు పత్తి ఆరబెట్టుకునేందుకు వీలుగా షెడ్లు ఏర్పాటు చేశారు. రైతుల కోసం తాగునీటి వసతి కల్పించారు. టాయ్లెట్లు నిర్మించారు. మద్దతు ధరకు మించి ట్రేడర్స్ ధరలు పెంచుతుండడంతో రైతులు సబ్మార్కెట్లలో పంటను విక్రయిస్తున్నారు. నాలుగు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు బయట మార్కెట్‌కే మొగ్గు చూపుతున్నారు.
పత్తి తీత పనులు ప్రారంభం కావడంతో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. రైతులు కూలీలకు కిలోల చొప్పున లెక్కగట్టి కూలి చెల్లిస్తున్నారు. ఒక్కో కూలీ రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నారు. సబ్యార్డుల్లో పత్తి లోడింగ్ చేసే కూలీలు రోజుకు రూ.వెయ్యి వరకు కూలి పొందుతున్నారు. ఒక్కో సబ్‌యార్డులో వందలాది మంది పనిచేస్తున్నారు. వీరికి ఆరు నెలల వరకు ఉపాధి లభించనున్నది. సుజాతనగర్, జూలూరుపాడు యార్డుల్లో సుమారు 1,400 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు.
జిల్లాలో పత్తి బాగా పండింది. మాకు ఆరు నెలల పాటు ఉపాధికి ఢోకా లేదు. తెల్లవారుజామునే మార్కెట్లకు వస్తున్నాం. లారీల్లో పత్తి లోడ్ చేస్తున్నాం. బయట కూలి కంటే ఇక్కడే మాకు ఎక్కువ కూలి వస్తున్నది. ట్రేడర్స్ మాకు తాగునీటి వసతి, విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు ఏర్పాటు చేశారు. పత్తి పనులు పూర్తయితే మళ్లీ మిర్చి పనులకు వెళ్తాం.
– నాగయ్య, కూలి,
పాపకొల్లు, జూలూరుపాడు మండలం
ప్రతిరోజూ తెల్లవారుజామునే పనికి వస్తున్నాం. రోజుకు రూ.900 నుంచి రూ.వెయ్యి వరకు కూలి లభిస్తున్నది. సాయంత్రం వరకు పని చేసి ఇంటికి వెళ్తాం. జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల నుంచి ఎక్కువ మంది కూలీలు పనికి వస్తున్నారు. ఇప్పుడు పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్వగ్రామానికి దగ్గర్లోనే ఉపాధి దొరుకుతున్నది.
– కొంగర సైనీ, కూలీ,
లింగన్నపేట, జూలూరుపాడు మండల