భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): నిత్యం బిజీ గా ఉండే ప్రతి కుటుంబం ఏదో ఒక రోజున సేద తీర్చుకోవాలనే అవకాశం రావాలని మనసు కలవరిస్తుంటుంది. ఎన్ని పని ఒత్తిళ్లు ఉన్నా కుటుంబాలు, స్నేహితులతో గడిపితే ఎక్కడ లేని ఆనందం సొంతమవుతుంది. ఆత్మీయ బంధాలకు వన భోజనాలు వేదికలుగా, మరపురాని గుర్తులుగా మిగిలిపోతున్నాయి. ఈ కార్తీక మాసంలో ఇప్పటికే వన భోజనాల సందడి మొదలైంది. కొంత మంది కుటుంబాలు, బంధువులు కలిసి వెళ్తుంటే, మరికొంత మంది కులాలవారీగా వనం బాట పడుతున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు, వన భోజనాల పేరుతో కలుసుకుంటే రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. గృహిణులు ఇంటి పనులతో, ఉద్యోగులు ఆఫీస్ విధులతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ రొటీన్ లైఫ్‌తో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ సినిమాకో, షికారుకో వెళ్తుంటారు. అలసిన మనసుకు ఇది తాత్కాలిక ఉపశమనమే. ఏడాదిపాటు మీ మనసు రిలాక్స్డ్గా ఉండాలంటే మాత్రం.. తప్పనిసరిగా వన భోజనాలకు వెళ్లాల్సిందే. ఎందుకంటే.. అనేక కుటుంబాలు ఒక్కచోట కలుసుకునే వేదిక అది. కొత్త పరిచయాలు ఏర్పడాలన్నా, పాత స్నేహితులను కలుసుకోవాలన్నా, ఆత్మీయులు-బంధువులతో మనసారా ముచ్చట్లాడాలనుకున్నా. పిల్లలకు ఆటవిడుపుగా ఉండాలన్నా.. అన్నిటికీ ఒకే వేదికగా ఉపయోగపడుతుంది.. వన భోజనాలు.
సందడి సందడిగా.. సరదా సరదాగా..
ఒకవైపు చలి, మరోవైపు మధ్య మధ్యలో సూర్య కిరణాలు. అటుగా వచ్చే వాగులో చల్లని నీటి ప్రవాహం. చుట్టూ చెట్లు, అక్కడక్కడా కొండలు. వన భోజనాలకు ఇలాంటి ప్రదేశాలు బాగుంటాయి. అన్నిచోట్ల ఇటువంటివి ఉండకపోవచ్చు. సాధారణంగా ఎక్కడో ఒకచోట (మామిడి) తోటలు వంటివి ఉంటాయి కాబట్టి.. అక్కడికే వన భోజనాలకు వెళ్తున్నారు అనేకమంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వండుకుని తిని, ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.
పలకరింపులు… పరిచయాలు
‘ఏమండీ..! బాగున్నారా..? పిల్లలు ఏం చేస్తున్నారు..? అంతా సెటిల్ అయ్యారా..?’ ఇలా ఆత్మీయ పలకరింపులు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకు సంబంధాల వెతుకులాట. రాజకీయ నాయకులు తమ కుల బంధువులకు మానసికంగా దగ్గరయ్యే అవకాశం. ఇలా ఎన్నింటికో ఈ వన భోజనాలు వేదికగా మారుతున్నాయి. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం మన సంప్రదాయం. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి వన భోజనాలు చేస్తున్నారు.
కుల సంఘాలకు వేదికలు
కార్తీక వన సమారాధనలు ఇప్పుడు కుల సంఘాలకు వేదికలుగా మారుతున్నాయి. ఎవరికి వారే కులాల వారీగా భోజనాలు ఏర్పాటు చేసుకుని పెద్ద నాయకులను ఆహ్వానిస్తున్నారు. తమ సంఘం ఐక్యతపై చర్చించుకుంటున్నారు. కొంతమంది వీటినే రాజకీయ వేదికలుగా ఎంచుకుంటున్నారు.
పిల్లలకు పిక్నిక్ స్పాట్
ఇక పాఠశాలల యాజమాన్యాలైతే పిక్నిక్ స్పాట్లను ఎంచుకుని విహార యాత్రలకు విద్యార్థులను తీసుకెళ్తున్నాయి. వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతున్నారు. భద్రాచలం రామాలయం, పర్ణశాల, మణుగూరు జలపాతం, ఇల్లెందు వాటర్ ఫాల్స్, బూర్గంపాడు అటవీ ప్రాంతం, అశ్వారావుపేట మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాలు, గోదావరి తీర వన భోజనాల సందడి కనిపిస్తున్నది.
మధురమైన జ్ఞాపకాలు
వన భోజనాలు.. మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. పెళ్లయ్యక ఎక్కడికో వెళ్లిపోయిన అనేకమంది తమ మిత్రులు, ఆత్మీయులు, బంధువులను కలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశం. మేం ప్రతి సంవత్సరం వన భోజనాలకు వెళ్తున్నాం. ఈసారి కూడా వెళ్లాం. చాలా హ్యాపీగా అనిపించింది.
– పసుపులేటి హైమ. గృహిణి. కొత్తగూడెం
ఉల్లాసం.. ఉత్సాహం..
రొటీన్ లైఫ్‌లో బిజీగా లేని రోజంటూ ఉండదు. ఫంక్షన్లకు వెళ్లినా.. బంధువులతో మాట్లాడుకునే వీలుండదు. వన భోజనాలు అలా కాదు. రోజంతా వనంలోనే ఉల్లాసంగా-ఉత్సాహంగా గడపొచ్చు. తీరిగ్గా ముచ్చట్లాడుకోవచ్చు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులు కలుస్తారు.
– వాణీరెడ్డి, గృహిణి, కొత్తగూడెం