సత్తుపల్లి టౌన్, నవంబర్ 17: సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలన్నారు.
సభకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉభయ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావును ఆహ్వానించామన్నారు. సత్తుపల్లి సభ తర్వాత రానున్న 11నెలల్లో ఉమ్మడి జిల్లాలోని మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. మధ్యాహ్నం 1 గంటకు తల్లాడలో ఎంపీలకు ఘన స్వాగతం పలుకుతామన్నారు. 2 గంటలకు కల్లూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ర్యాలీగా పెనుబల్లి నుంచి సత్తుపల్లికి చేరుకుంటామన్నారు.
సత్తుపల్లిలో మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత బహిరంగ సభ జరిగే మైదానానికి చేరుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమర్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మున్సిపల్ చైర్మన్ మహేశ్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్ పాషా, అనిల్, అమరవరపు కృష్ణారావు, నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, యాగంటి శ్రీను, రఫీ, కృష్ణయ్య, మధు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
బహిరంగ సభ జరుగనున్న ప్రదేశంలో ఏర్పాట్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యవేక్షించారు. రాత్రి సభకు ఇబ్బంది కలుగకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయించారు. సభా ప్రాంగణం వద్ద తాగునీటి వసతి కల్పించారు. బస్టాండ్ ఆవరణ, కృష్ణుడి గుడి, జ్యోతి నిలయాల వద్ద వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని కల్లూరు ఏసీపీ వెంకటేశ్‌ను ఆదేశించారు.