నేడు కొత్త గూడెం వైద్యాకళాశాల ప్రారంభం
మన్యానికి మహర్దశ పట్టనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏళ్లనాటి కల సాకారం కాబోతున్నది. రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెంలోని మెడికల్ కళాశాల ప్రారంభం కానున్నది. తరగతుల ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి వైద్య విద్య అందుబాటులోకి రానుండడంతో మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర కోటాల నుంచి మొత్తం 150 మంది కళాశాలలో ప్రవేశాలు పొందారు. నేషనల్ కోటాలో 15 శాతం సీట్లను భర్తీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులతో భర్తీ అయ్యాయి. – భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
అందుబాటులో 350 బెడ్లు…
కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండడంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం చేరువకానున్నది. 350 బెడ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే రామవరంలో మాతాశిశు ఆరోగ్యం కేంద్రంలో 100 బెడ్ల ద్వారా ప్రసూతి సౌకర్యాలు అందుతున్నాయి. కాలేజీకి ఫ్యాకల్టీ కూడా అందుబాటులోకి వచ్చారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు కలిపి 54 మంది టీచింగ్ స్టాఫ్‌ను నియమించారు. ఆర్ఎంవో అదనం. మెడికల్ కాలేజీలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలను కూడా అందుబాటులోకి వచ్చాయి.
150 మంది విద్యార్థులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోటా నుంచి ఎంపికైన విద్యార్థుల్లో చాలా మంది ఇప్పటికే ఈ కాలేజీలో ప్రవేశం పొంది ఉన్నందున వారికి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నేషనల్ కోటాలో 15 శాతం సీట్లు, రాష్ట్ర కోటా నుంచి 85 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. స్థానిక విద్యార్థులకు కూడా సీట్లు లభించాయి.
మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషకరం..
కొత్తగూడెం మెడికల్ కాలేజీలో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండడం సంతోషకరం. ఈ తరగతులను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి పర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. 92 మంది విద్యార్థులు ఇప్పటికే జాయిన్ అయ్యారు. మిగతా వాళ్లు కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. 54 మంది టీచింగ్ స్టాఫ్ రెడీగా ఉన్నారు. జనరల్ ఆసుపత్రిలో 250 బెడ్లు, రామవరం ఎంసీహెచ్‌లో 100 బెడ్లు కలిపి మొత్తం 350 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర కేసుల కోసం మరో పది బెడ్లను కూడా సిద్ధంగా ఉంచాం.
-అనుదీప్, కలెక్టర్ భద్రాద్రి