అప్పులు చేసి.. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి విపత్తుల నుంచి పైరును కాపాడి రైతు పంట పండిస్తాడు.. ఆ పంటకు గిట్టుబాటు ధరను ఆశిస్తాడు.. మంచి ధర లభించకుంటే తాను ఆశించిన ధర వచ్చే వరకు పంటను దాచిపెట్టాలనుకుంటాడు.. ఎక్కడో ఒకచోట దాచిపెడదామంటే ఎండకు వానకు ఇబ్బందే. ప్రైవేటు గోదాముల్లో దాచేద్దామంటే అద్దెల భారం. గత్యంతరం లేక అమ్మేద్దామంటే దళారి ఇచ్చిందే రేటు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రైతన్నల అవసరాలకు అనుగుణంగా గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని జింకలతండాకు వెళ్లే మార్గంలో సర్కార్ మూడు గోదాములు నిర్మించింది. త్వరలో వాటిని మంత్రులు నిరంజన్‌రెడ్డి, అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు.
ఖమ్మం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకుంటే రైతులు పంటను దాచుకోలేని పరిస్థితి. ఎక్కడో ఒకచోట దాచిపెడదామంటే ప్రకృతి విపత్తులను ఎదుర్కోలేని నిస్సహాయత. ప్రైవేటు గోదాముల్లో దాచుకుందామంటే అద్దెలు కట్టలేని దీనస్థితి. ఇక గత్యంతరం లేక అప్పుడున్న ధరకు లేదా దళారి ఇచ్చే రేటుకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి. అందిన సొమ్ము సాగుకు తెచ్చిన అప్పులకు కట్టే వడ్డీలు, కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఇవన్నీ ఉమ్మడి పాలనలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు. ఈ నేపథ్యంలో రైతులు పంట దాచుకునేందుకు వీలుగా గోదాములు నిర్ణయించారు.
రఘునాథపాలెం మండలం జింకల తండాకు వెళ్లే రోడ్డులోని ఐదెకరాల స్థలంలో గోదాముల నిర్మాణానికి గతేడాది మంత్రి అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రూ.14.90 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్మించింది. త్వరలో గోదామును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గోదాములను ప్రారంభిచనున్నారు. రెండు గోదాముల సామర్థ్యం 7,500 మెట్రిక్ టన్నుల చొప్పున కాగా మూడో గోదాము సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నులు. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ఏటా రెండుసార్లు రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. ప్రతి సీజన్లో ఠంచనుగా విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. మిషన్ కాకతీయ, చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు దండిగా పెరిగాయి. రైతు రుణమాఫీ పథకంతో రైతులకు రుణభారం తగ్గించారు. అలాగే రైతులు తాము పండించిన పంటను నిల్వచేసుకునేందుకు వీలుగా గోదామలు నిల్వ చేసుకునేందుకు వీలుగా గోదాముల నిర్మిస్తున్నది.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గిడ్డంగి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రానున్నది. రూ.14.90 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు గోదాముల్లో రైతులు పంట దాచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు దాచుకునేలా అవకాశం కల్పించనున్నాం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్