ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 13: నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి తరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తెలిసో తెలియకో వారు పొరపాట్లు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తమ బాల్యాన్ని ఆనందంగా గడిపేలా వారిలో ఉత్సాహాన్ని నింపాలి. విద్యావంతులుగా ఎదగనివ్వాలి. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. సరిగ్గా ఇవే ఆలోచనలు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఉండేది. ఆయన్నే మనం ముద్దుగా ‘చాచా నెహ్రూ’ అని పిలుచుకుంటాం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నారులు కనిపిస్తే వారిని దగ్గరకు పిలిచి గులాబీ ఇచ్చే వారు. చిరునవ్వులు చిందించేవారు. ఆయన 1889 నవంబర్ 14న జన్మించారు. సుసంప్నమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రజల మీద ప్రేమ పెంచుకున్నారు. భావితరాల బాగోగులపై దృష్టి సారించారు. జీవితాంతం దేశ సేవలోనే ఉన్నారు. ఆయన పుట్టినరోజున ఏటా మనం బాలల దినోత్సవం జరుపుకొంటున్నాం. సోమవారం ఆయన జయంతి సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలల యాజమాన్యాలు బాలల దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేశాయి. ఇప్పటికే విద్యార్థుల కోసం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించాయి. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అబ్బురపరిచారు. బాలల దినోత్సవ వేడుకల్లోనూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
బాలల మెదడుకు పదును పెట్టేందుకు నూతన ఆవిష్కరణలను కనిపెట్టేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న సైన్స్ఫెయిర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులు కొత్త కొత్త ప్రాజెక్టులు తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. చిన్న వయసులోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని బాల శాస్త్రవేత్తలవతున్నారు.
చిన్న వయసులోనే విద్యార్థులు మహాత్ముని గాథ తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో పది రోజుల పాటు సినిమా థియేటర్లలో ప్రఖ్యాత ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించింది. విద్యార్థులందరూ తమకు ఏటాయించిన సమయానికి థియేటర్లకు వెళ్లి ఉచితంగా చిత్రాన్ని చూశారు. విద్యార్థులు గాంధీ సేవలను గుర్తించి, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఎదిగేందుకు సర్కార్ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యం. సంతోషాలమయం. అలాంటి అపురూపమైన బాల్యంపై ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై ఎంతైనా ఉంది. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేస్తారు. చిన్న చిన్న తప్పులూ చేస్తారు. వాటన్నింటినీ తప్పులుగా పరిగణించకుండా ఉంటే మంచిది. అతి గారబం తప్పు గానీ తప్పొప్పులను చెప్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తే మంచిది.
ప్రస్తుత సమాజంలో విద్యావ్యవస్థ జైలు జీవితంలా మారింది. బండెడు సిలబస్‌ను పిల్లలపై రుద్దేలా వ్యవస్థ ఉంది. ఇలాంటి సందర్భంగా పసి మనసులకు కాస్త ఆహ్లాదాన్ని అందించాలి. తోటి పిల్లలతో కాసేపు ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఒత్తిడికి గురవుతుంటే గమనించి వారికి ఊరటనివ్వాలి. ఇప్పటి పిల్లలు కంప్యూటర్, ట్యాబ్‌ల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నారనేది వాస్తవమే. కానీ ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడమూ ముఖ్యమే. ఆ ప్రాయంలోనే వారిలో స్నేహం అనే భావన చిగురిస్తుంది. మంచి స్నేహితులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.