జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైవేలు అడుగుకో గుంత.. అతుకుల బొంత అన్న చందంగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రుద్రంపూర్ నుంచి పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సారపాక మీదుగా జాతీయ రహదారి వెళ్తున్నది. సుమారు 50 కిలోమీటర్ల పొడవునా చేపట్టిన ఎన్హెచ్ 30 జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు మంజూరై ఏడేళ్లయినా పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2015లో రూ.220 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టర్లు 2018లోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలో రహదారిపై ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రుద్రంపూర్ నుంచి పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సారపాక మీదుగా సుమారు 50 కిలోమీటర్ల పొడవునా ఎన్హెచ్ 30 జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు మంజూరై ఏడేళ్లయినా పనుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2015లో రూ.220 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టర్లు 2018లోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలో రహదారిపై ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. కలెక్టర్ అనుదీప్ చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులను హెచ్చరించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
అసంపూర్తిగా బ్రిడ్జిలు..
నేషనల్ హైవే పరిధిలోని గోధుమ వాగు, మొర్రేడు వాగు బ్రిడ్జి పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. నిత్యం వేలాది వాహనాలు తిరిగే రహదారిపై బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు పెదవి విరుస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జి పనులూ పూర్తిగా నిలిచిపోయాయి. మొదటి బ్రిడ్జిపై వేసిన రహదారిపై పెచ్చులు లేచి గుంతలు ఏర్పడ్డాయి. పాత బ్రిడ్జి కావడంతో ఇటీవల వచ్చిన వరదలకు వాహన రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది. వంతెన పక్కన రెయిలింగ్ కూడా దెబ్బతిన్నది. వెంటనే రెండో బ్రిడ్జి పనులు ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు.
నిత్యం ప్రమాదాలు..
విజయవాడ – జగ్దల్పూర్ నేషనల్ హైవే అధ్వానంగా ఉంది. అధికారుల ఆలసత్వం కారణంగా రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగరేణి కార్మికులు నిత్యం ఈ ప్రాంతం నుంచే రాకపోకలు సాగిస్తారు. హైవే అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలి.
– చిట్టి సంపత్కుమార్రెడ్డి, రుద్రంపూర్
బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం..
రామవరం ఎస్సీబీ నగర్ జాతీయ రహదారిపై గోధుమ వాగు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో నిత్యం వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి సరిగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
– శ్యాంసుందర్, కోల్ ట్రాన్స్పోర్ట్ గుమస్తా