పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లెలు స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నాయి. పరిశుభ్రత, పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో వైకుంఠధామాలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో జిల్లాలోని ప్రతి పంచాయతీ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 23 మండలాల్లోని 481 పంచాయతీల పరిధిలో ప్రతి గ్రామం నుంచి పురస్కారాలకు దరఖాస్తు చేయిస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లా స్వచ్ఛత దిశగా పయనిస్తున్నది. ఓడీఎఫ్ జిల్లాగా అవతరిస్తున్నది. క్లీన్ అండ్ గ్రీన్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నది. కలెక్టర్ అనుదీప్ జిల్లాలోని పంచాయతీలకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పంచాయతీలు పురస్కారాలు సొంతం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరిలో పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, జనాభాకు తగినట్లు పబ్లిక్ టాయిలెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది. 23 మండల్లాల్లోని 481 పంచాయతీల పరిధిలో ప్రతి పంచాయతీ నుంచి పురస్కారాలకు దరఖాస్తు చేయిస్తున్నారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి 113 ప్రశ్నల పత్రాన్ని పూర్తి చేస్తున్నారు. 15 శాఖల సాయంతో పురస్కారాలకు సంబంధించిన పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. గడిచిన నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో పది రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎంపీవోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
తొమ్మిది విభాగాలు ఇలా..
ఒక పంచాయతీ జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకోవాలంటే ఆ పంచాయతీ తొమ్మిది విభాగాల్లో పురోగతి సాధించి ఉండాలి. పేదరిక నిర్మూలనకు ఉపాధి కార్యక్రమాలు, ఆరోగ్యకర, పిల్లలకు స్నేహపూర్వక, నీటి ఎద్దడి లేని, క్లీన్ అండ్ గ్రీన్, స్వయం సమృద్ధి, సామాజికంగా సురక్షిత, సుపరిపాలన, మహిళలకు స్నేహపూర్వకంగా ఉన్న పంచాయతీలను అవార్డులు వరించనున్నాయి.
మారిన పల్లెల ముఖచిత్రం..
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా విడతలు వారీగా అమలు చేసిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రతి పంచాయతీకి వాటర్ ట్యాంకర్, ట్రాక్టర్, చెత్త తరలించేందుకు ట్రాలీలు అందుబాటులోకి వచ్చాయి. హరితహారంలో భాగంగా ప్రతి పల్లె పచ్చందాలను పరచుకున్నది. అవెన్యూ ప్లాంటేషన్ పల్లెలకు పచ్చ తోరణాలుగా మారాయి. ప్రతి పల్లె నందనవనమైంది. పల్లెల సందర్శనకు వచ్చిన ప్రతి కేంద్ర బృందం గ్రామాభివృద్ధిని చూసి అబ్బురపడ్డాయి. గతంలో గ్రామాలు అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. మున్ముందు జాతీయ పురస్కారాలనూ సొంతం చేసుకుంటామని కలెక్టర్ అనుదీప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పురస్కారాలు ఇలా..
జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన పంచాయతీకి రూ.50 లక్షలు, రెండోస్థానంలో నిలిచిన పంచాయతీకి రూ.40 లక్షలు, మూడోస్థానంలో నిలిచిన పంచాయతీకి రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకాలు కేంద్రం అందించనున్నది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన కాపీలు కలెక్టర్ అనుదీప్ టేబుల్ మీదకు వచ్చాయి. ఈ మూడు విభాగాల్లో కేంద్రం మొత్తం 81 పంచాయతీలకు పురస్కారాలు అందించనున్నది. పంచాయతీ కార్యదర్శులు అప్లోడ్ చేసే పత్రాల పర్యవేక్షణకు మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్‌గా, జిల్లాస్థాయిలో డీపీవో కన్వీనర్‌గా, కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పురస్కారాలను సొంతం చేసుకుంటాం..
భద్రాద్రి జిల్లాలోని ప్రతి పల్లె అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. స్వచ్ఛత, శుభ్రతలో ముందంజలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధికి వెచ్చించాం. అభివృద్ధి సాధించాం. ఇప్పటికే పురస్కారాలకు నివేదికలను అప్లోడ్ చేయించాం. మరోసారి జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులు సాధిస్తాం.
– దురిశెట్టి అనుదీప్, భద్రాద్రి కలెక్టర్