చుట్టూ పచ్చని పాపికొండలు.. మధ్యలో గోదావరి.. తీరం అటూఇటు కనబడని నదీప్రవాహం.. ప్రయాణం చేసే కొద్దీ చేయాలనిపించే లాంచీ ప్రయాణం ఈ నెల 9వ తేదీన ప్రారంభంకానున్నది. భద్రాచలం నుంచి 80 కిలోమీటర్ల బస్సు ప్రయాణం తర్వాత లాంచీ ప్రయాణంలో సుమారు నాలుగు గంటలపాటు విహరించవచ్చు. వీఆర్ పురం మండలం పోచవరం గ్రామంలో బోటింగ్ పాయింట్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రెండు ప్రాంతాలను తాకుతూ సాగే ప్రయాణం పర్యాటకుల మనసు దోచేయనున్నది. ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందాలు పాపికొండల సొంతం. పచ్చని కొండల నడుమ లాంచీ ప్రయాణం కనువిందు చేయనున్నది.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రికి పెరుగనున్న భక్తుల తాకిడి
పర్యాటకం ఎటువైపు ఉన్నా భద్రాద్రికి మాత్రం భక్తులు తాకిడి భారీగానే పెరుగనున్నది. గత ఆరునె లలుగా గోదావరి వరదలు రావడం, పోవడంతో అక్కడ ప్రజలు కష్టాల నుంచి కోలుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడడంతో పర్యాటకులు విహారానికి సై అంటున్నారు. దీంతో హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, గుంటూరు, తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువగానే పర్యాటకు లాంచీ ప్రయాణానికి సై అంటున్నారు. దీంతోపాటు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉండడంతో పర్యాటకులు విహారయాత్రకు సిద్ధమవుతున్నారు. అసలే కార్తీక మాసం ఎక్కువ మంది కుటుంబాలు, స్నేహితులుగా విహారం చేసి సందడి చేసేందుకు సంసిద్ధులు కావడం లాంచీ ప్రయాణం ప్రారంభంకావడం ఇక్కడ కలిసొచ్చిన అంశం. దీంతో భద్రాచలంలో వ్యాపారాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. విహారయాత్రల వల్ల ఆటోలు, ట్రాలీలు, టాటా ఏసీలు, మినీ బస్సులు, అటు వ్యాపారాలు బిజీ కానున్నాయి. దీంతో భద్రగిరి పర్యాటకులతో సంక్రాంతి వరకు సందడిగా మారనున్నది.
వరదలు భద్రాద్రిని వదలకపోవడంతో లాంచీ విహారానికి చాలా విరామం వచ్చింది. ఇటు కార్తీక మాసం భక్తులు, పర్యాటకులు విహారయాత్రలకు వెళ్లే సమయం కావడంతో లాంచీ ప్రయాణానికి అనుమతులు వచ్చాయి.. దీంతో ప్రకృతి ప్రేమికులకు రెక్కలు వచ్చినట్లయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి సాగే లాంచీ ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్ రావడంతో గోదావరి నదిలో సాగే ప్రయాణం మళ్లీ ప్రారంభంకానున్నది. దీంతో భద్రగిరికి భక్తుల సందడి మరింత పెరుగనున్నది. చాలాకాలంగా లాంచీ ప్రయాణం లేక పర్యాటకులు తీర్థయాత్రలు కూడా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కార్తీక మాసం కావడం, మరోవైపు లాంచీ ప్రయాణం ప్రారంభం కావడంతో భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉంది.
భద్రాచలం కేంద్రంగా రాముడు నడయాడిన పుణ్యభూమిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా భక్తులు దర్శించుకునేందుకు నెలవుగా ఉన్నాయి. భద్రాచలంతోపాటు రాముడు, సీతమ్మ తిరిగిన ప్రాంతాలు దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల, భద్రాచలం పక్కనే ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న ఉష్ణగుండాల, అప్పటి ఖమ్మం జిల్లాలో ఉన్న వర రామచంద్రాపురం మండలంలో శ్రీరామగిరి, రామలక్ష్మణ చెట్టు వాలీసుగ్రీవుల గుట్టలు పర్యాటక ప్రాంతాలుగా నేటికీ ప్రాచుర్యం పొంది ఉన్నాయి. వీటన్నింటినీ చూడదగ్గ ప్రాంతాలుగా పర్యాటకశాఖ గుర్తించింది. ఇందుకోసం తెలంగాణ పర్యాటకశాఖ టూరిజం ప్యాకేజీని కూడా అందుబాటులో ఉంచింది.
టూరిజం ఆధ్వర్యంలో ప్యాకేజీ
పాపికొండల విహార యాత్రకు గతంలో మాదిరిగానే తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ నుంచి పోచవరం వరకు పెద్దలకు రూ.4990, పిల్లలకు రూ.3990 నిర్ణయించారు. టూరిజంలో కాకుండా ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారు కూడా లాంచీ టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. లాంచీ టికెట్ పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థులు ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ రేటులో ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది.