మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించినందుకు గాను ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబురాలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో మంత్రి అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయం నుంచి నగరమంతటా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల వ్యాప్తంగానూ సంబురాలు జరిగాయి. ఘనవిజయంపై ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
– ఖమ్మం, నవంబర్ 6: (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి ప్రజాస్వామ్యం నిలబడింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అందలం ఎక్కించింది. టీఆర్ఎస్ ధర్మ పోరాటం చేసి అధర్మంపై విజయ దుందుభి మోగించింది. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రత్యర్థి అహంకారం ఓడి ఆత్మగౌరవం గెలిచింది. ప్రత్యర్థి పార్టీల కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలు ఓటర్ల ముందు పనిలేదు. మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
– నామా నాగేశ్వరరావు , ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత
మునుగోడు ఉప ఎన్నిక ప్రభంజనం. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయఢంకా మోగించారు. ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. వచ్చే ఎన్నిక ఏదైనా మళ్లీ టీఆర్ఎస్దే విజయం. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్త, నాయకులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
మనుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి ధర్నాన్ని గెలిపించారు. అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలు, ప్రచారాలు ఏమాత్రం పారలేదు. ఇక ముందు ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ విజయం. మున్ముందు గులాబీదళం జైత్రయాత్రే. సీఎం కేసీఆర్ దేశ్ కీ నేతగా దేశ రాజకీయాల్లోనూ సత్తా చాటనున్నారు.
– ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఇక బీజేపీ పతనం మొదలైనట్లే. గుజరాత్ గులాంలపై తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. దీంతో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవుతున్నాయి. బీజేపీ నాయకులు వాటిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తారు. – రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా మునుగోడు ఓటర్లు కారు గుర్తుకే ఓటు వేశారు. రానున్న ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
మునుగోడు ఉప ఎన్నికలో గెలుస్తామని విర్రవీగిన బీజేపీ నాయకుల ఆటలకు చెక్ పడింది. ఇక వారి పలాయనమే. కాషాయ నేతలు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే గెలిపించారు. ఇదే ఒరవడిలో గులాబీ శ్రేణులు వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్ఎస్దే.
– వనమా వెంకటేశ్వరరావు,కొత్తగూడెం ఎమ్మెల్యే.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే ఘన విజయాన్ని కట్టబెట్టారు. సీఎం, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. సత్ఫలితాన్ని సాధించారు. బీజేపీ కుయుక్తులు, కుతంత్రాలు తెలంగాణలో పారవు.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా అంతిమ విజయం టీఆర్ఎస్దే అయింది. ఎంత మంది ప్రధాని మోదీలు వచ్చినా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసినా ఆ పప్పులు తెలంగాణలో ఉడకవు. మునుగోడు విజయం ఘన విజయం. ఇది సీఎం కేసీఆర్‌కు దేశరాజకీయాలకు పిలుపు వంటిది. బీఆర్ఎస్కు తిరుగు లేదు. ప్రభుత్వ పధకాలను ప్రజలు నమ్మారు. అందుకే మనుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు.
– కోరం కనకయ్య, భద్రాద్రి జడ్పీ చైర్మన్