ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 6 : చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఖమ్మం నగరంలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వర్తక సంఘం ప్రధానశాఖతోపాటు దిగుమతి, మిర్చిశాఖ, కలప, సామిల్శాఖకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రధాన అధికారిగా పీబీ శ్రీరాములు వ్యవహరించారు. ఆయనతోపాటు మరో 30 మంది న్యాయవాదులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వర్తక సంఘంలో మొత్తం 1,214 ఓట్లు ఉండగా, 1,167 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. త్రీ టౌన్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వర్తక సంఘం ఫలితాలపై నగర ప్రజలు ఆసక్తి కనపరిచారు. ఎన్నికల అధికారి పీబీ శ్రీరాములు ఆధ్వర్యంలో సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మరోసారి చిన్ని కృష్ణారావు ఘనవిజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కొదుమూరి మధుసూదన్‌పై 218 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా మెంతుల శ్రీశైలం ఈ దఫా ప్రత్యర్థి గొడవర్తి శ్రీనివాసరావుపై 195 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడికి సంబంధించి సోమ నరేశ్ తన సమీప ప్రత్యర్థి పత్తిపాక రమేశ్‌పై భారీ ఆధిక్యతతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మన్నెం కృష్ణయ్య తన సమీప ప్రత్యర్థి కురువెళ్ల కాంతారావుపై విజయం సాధించారు. కోశాధికారిగా తల్లాడ రమేశ్ తన సమీప ప్రత్యర్థి తూములూరి లక్ష్మీనర్సింహరావుపై విజయం సాధించారు. వీరితోపాటు మిర్చిశాఖ ప్రధాన కార్యదర్శిగా ఎడ్లపల్లి సతీశ్, సామిల్శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా చిత్తలూరి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా బాసా మల్లికార్జున్ విజయం సాధించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధానశాఖగా భావించే దిగుమతిశాఖ అధ్యక్షుడిగా మరోసారి దిరిశాల వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వడ్డె నర్సింహారావుపై గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పదవిని ముత్యం ఉప్పలరావు సొంతం చేసుకున్నారు. ముక్కోణపు పోటీలో ఉప్పలరావు ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. వీరితోపాటు ఈసీ సభ్యులుగా బండి సతీశ్, మల్లెల అప్పారావు, జంగిలి రమణ, సాదె శంకర్, సుధీర్‌కుమార్, సారిక పాపారావు, సిరికొండ వెంకటేశ్వర్లు, మేడ లింగయ్య గెలుపొందారు.