కల్లూరు, నవంబర్ 5: మండలంలో 32 ఏళ్లుగా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి తీసుకురావడంతో శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణను కలిసి సమస్యలు వివరించారు. మండలంలోని తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన 43 మంది రైతుల అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు 32 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిందని, నేటికి అవి చెల్లుబాటులో లేవని, పదెకరాల భూమి చేతిలో ఉన్నా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. దళిత రైతులుగా ఉన్న వీరందరికీ ఆ భూమికి సంబంధించి పట్టాలు ఇప్పించాలని ఆర్డీవోకు సూచించారు. పెనుబల్లి మండలంలో గిరిజనులకు ధ్రువపత్రాలు అందించడంలో జాప్యం జరుగుతుందని, వెంటనే ధ్రువపత్రాలు అందించాలన్నారు. స్పందించిన ఆర్డీవో సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మాజీ ఎంపీటీసీకి పరామర్శ
మాజీ ఎంపీటీసీ కంభంపాటి పుల్లారావు ఇటీవల అనారోగ్యానికి గురై నేత్రచికిత్స చేయించుకుని శాంతినగర్‌లోని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుల్లారావు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి మండల సభ్యుడు లక్కినేని రఘు, నర్వనేని అంజయ్య, పుసులూరి శ్రీనివాసరావు, కొరకొప్పు ప్రసాద్, పెడకంటి రామకృష్ణ, అంజిబాబు ఉన్నారు.
బుల్లిబాబు కుటుంబానికి పరామర్శ
వేంసూరు, నవంబర్ 5: మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన నాయకుడు గొర్ల సత్యనారాయణ రెడ్డి (బుల్లిబాబు) ఇటీవల మృతి చెందారు. శనివారం కందుకూరులోని బుల్లిబాబు నివాసానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుల్లిబాబు సోదరుడు డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డితో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అయ్యప్ప, భవానీ మాలధారులకు అన్నదానం
కల్లూరు, నవంబర్ 5: మండలంలోని అయ్యప్ప, భవానీ దీక్షలు తీసుకున్న మాలదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మహాన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం గురుస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి సండ్రను ఆశీర్వదించారు. సండ్ర మాట్లాడుతూ అయ్యప్ప, భవానీ, హనుమాన్ మాలధారులు 41 రోజుల పాటు దీక్ష తీసుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కల్లూరు, తల్లాడ, పెనుబల్లి ఎంపీపీలు బీరవల్లి రఘు, దొడ్డా శ్రీనివాసరావు, లక్కినేని అలేఖ్య, కల్లూరు జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు పాలెపు రామారావు, వీరమోహనరెడ్డి, కనగాల వెంకట్రావు, నాయకులు లక్కినేని రఘు, వెంకట్‌లాల్, చింతనిప్పు సత్యనారాయణ, మందడపు అశోక్, లక్కినేని వినీల్, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప, భవానీ, హనుమాన్ దీక్షాపరులు పాల్గొన్నారు.