సత్తుపల్లి, నవంబర్ 5: ఆదరణ లేక అవసాన దశకు చేరుకున్న కుల వృత్తులు సీఎం కేసీఆర్ విజన్‌తో తిరిగి జీవం పోసుకుంటున్నాయి. కుంటుపడిన గ్రామీణ వ్యవస్థ గాడిన పడింది. బతుకే భారమనుకున్న పరిస్థితి నుంచి హుందాగా, గౌరవప్రదంగా జీవించే స్థితికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ఇస్త్రీ దుకాణాలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కులవృత్తులకు ఆదరువు లభించింది. వారికి 100శాతం సబ్సిడీతో రూ.50 వేల రుణం అందుతున్నది. అంతరించిపోతున్న కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువచ్చారు. రజకులకు మోడ్రన్ ధోబీఘాట్లు నిర్మించి ఆదుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించి అండగా నిలుస్తున్నారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ రజకుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నారు.
మోడ్రన్ ధోబీ ఘాట్లు..
రజక వృత్తిదారులకు శారీరక కష్టాన్ని తగ్గించి స్వాంతన కలిగించాలని సర్కారు సంకల్పించింది. మొదట్లో ఒక్కో ధోబీఘాట్‌ను రూ.37 లక్షలతో నిర్మించాలని నిర్ణయించి ఆ మొత్తాన్ని రూ.52 లక్షలకు పెంచింది. ఇందులో రూ.17 లక్షలు మెషినరీ, మిగిలిన మొత్తాన్ని సివిల్ వర్క్‌కు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రుల్లో బట్టలు ఉతకడానికి రజకులకు కాంట్రాక్ట్‌లు అప్పగించి ఉపాధి కల్పిస్తున్నారు.
నాయీబ్రాహ్మణులకు అండ..
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణ సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు మేలు జరుగుతుంది.
హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు..
తెలంగాణ వచ్చాక కుల సంఘాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 40 కులాలకు స్థలాలు కేటాయించి పనులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రజక, నాయీబ్రాహ్మణులకు భూమి కేటాయించి ఉప్పల్‌లో నాయీబ్రాహ్మణులకు రెండెకరాలు, రజకులకు మూడెకరాల భూమి కేటాయించి నిర్మాణానికి అవసరమయ్యే నిధులనూ కేటాయించింది. ఆయా కులాలన్నీ ఒక సంఘంగా ఏర్పడేందుకు సర్కారు కృషి చేస్తుంది.
250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్…
దేశంలో ఎక్కడా లేని విధంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీషాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 50 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే జైళ్లకు పంపిన ఘటనలూ ఉన్నాయి. ఇక నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మునిసిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ నిబంధనలను మినహాయించింది. దీంతో ఆయా కులాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. పథకం కింద జిల్లాలో 5,003 మంది రజకులు, 1,411 మంది నాయీబ్రాహ్మణులు ఉచితంగా విద్యుత్ సదుపాయం పొందుతున్నారు.
రజకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు..
రజకుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూత అందించారు. రజకుల సంక్షేమానికి రూ.125 కోట్లు వెచ్చించిన నేత కేసీఆర్. నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ కులవృత్తులను కాపాడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 5 వేల కుటుంబాలకు చేయూత అందించారు. దీంతో పాటు చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. గతంలో నెలలో సగం సంపాదన విద్యుత్ బిల్లులకే సరిపోయేది. నేడు వచ్చిన సంపాదనతో కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి.
– బెల్లంకొండ రాము, రజకుడు, సత్తుపల్లి
కులవృత్తులకు జీవం..
మరుగున పడుతున్న కులవృత్తులకు జీవం పోశారు ముఖ్యమంత్రి కేసీఆర్. సెలూన్ షాపుల నిర్వాహకులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించారు. నెలంతా పనిచేసినా విద్యుత్ బిల్లులకే సంపాదన సరిపోయేది. మా కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం 250 యూనిట్ల వరకు సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. అధునాతన పరికరాల కొనుగోలుకు రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నది.
– నాగులవంక శ్రీను,సెలూన్షాప్ యజమాని, వీఎం బంజరు