ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలకు తప్పనిసరిగా ఆయా శాఖల జిల్లా అధికారులే హాజరు కావాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సమావేశాలకు కింది స్థాయి అధికారులు, సిబ్బంది వస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు. సమావేశానికి ఏదో వచ్చాం.. వెళ్లా.. అన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమగ్ర సమాచారంతో రావడం లేదన్నారు. సమావేశానికి రాని అధికారులకు షోకాజ్ నోటీసులు పంపించాలని జడ్పీ సీఈవో అప్పారావుకు సూచించారు. తొలుత 2వ గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించగా స్పందించిన జడ్పీ చైర్మన్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం 4వ కమిటీ విద్య, వైద్యం స్థాయి సంఘాల సమీక్షలో సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించగా ఎర్రుపాలెం జడ్పీటీసీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు రావడం లేదని ప్రస్తావించగా డీఈవో స్పందిస్తూ సమస్యను పరిషరించామన్నారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ప్రభుత్వ అనుబంధ గురుకుల కళాశాలల్లో చేరారని తెలిపారు. అదేవిధంగా ఖమ్మం రూరల్, ముదిగొండ ఇలా కొన్ని మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలలో గుడ్లు సక్రమంగా సరఫరా కావడంలేదని తెలపడంతో డీడబ్ల్యూవో సంధ్యారాణి స్పందిస్తూ కాంట్రాక్టర్ను మార్చామని, ఇటీవలే మరోకరిని నియమించామని తెలిపారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు తిరుపతి, దుర్గ, వరప్రసాద్ పాల్గొన్నారు.