ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే 102 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో కార్బొహైడ్రేట్స్ 22 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు ఉంటాయి. ‘రాకాశి ఫలం’ తినే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. దీంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి సారిస్తున్నారు. సాగుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.96 వేలు, రెండు, మూడు సంవత్సరాల్లో రూ.36 వేల చొప్పున రాయితీలు అందిస్తున్నది. ప్రస్తుతం మధిర నియోజకవర్గానికి చెందిన రైతులు సుమారు 60 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. వారికి ఉద్యానశాఖ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
బోనకల్లు, నవంబర్ 2: డ్రాగన్ ఫ్రూట్‌ను 21వ శతాబ్దపు అద్భుత ఫలంగా అభివర్ణిస్తారు. ఈ మొక్క కాక్టస్ జాతికి చెందినది. వీటికి పాకుతూ పెరిగే గుణం ఉంటుంది. దక్షిణ అమెరికా మొట్టమొదటిసారిగా పంట సాగైంది. ఆ తర్వాత థాయ్‌లాండ్, మలేషియా, వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగబాకింది. మన దేశంలో రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కొంతమేరకు సాగవుతున్నది. డ్రాగన్ ఫ్రూట్స్ సాగు ఉద్యాన పంట కిందకు వస్తుంది. వీటి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్‌కు మొదటి సంవత్సరానికి రూ.96 వేలు, రెండో సంవత్సరానికి రూ.36 వేలు, మూడో సంవత్సరానికి రూ.36 వేల సబ్సిడీలు అందిస్తున్నది. జిల్లాలోని చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ప్రస్తుతం 60 ఎకరాల్లో పంట సాగవుతున్నది.
ఈ మొక్కలు తక్కువ సమయంలో ఎక్కువ పొడవు పెరుగుతాయి. వీటికి స్తంభాలపైకి ఎగబాకే గుణం ఉంటుంది. ఫలసాయం వచ్చిన సమయంలో పండ్లు కిందకి పడి, నేలకు తాకి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. దీని నివారణకు మొక్కలు మొలక దశలో ఉన్నప్పుడు వాటి శాఖలను, తీగలతో స్తంభానికి వదులుగా కట్టి ఉంచాలి. అడ్డంగా పెరిగే శాఖలను కత్తిరించాలి. నిటారుగా పెరిగే శాఖలను మాత్రమే ఉంచాలి. ఆరోగ్యకరమైన మొక్కకు ఏడాదిలో 30 కొమ్మలు వస్తాయి. నాలుగో ఏడాది వచ్చే సరికి అవి 190 కొమ్మలవుతాయి. అన్ని శాఖలు ఉంటే మొక్కలను చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పంటలో అంతరకృషి సాధ్యంకాదు. రైతులు వడలిపోయిన కొమ్మలు, చీడపీడల ఉధృతి ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేయాలి. ఒక్కో మొక్కకు ప్రధానంగా 50 కొమ్మలు ఉండేలా చూసుకోవాలి. కొమ్మలను కత్తిరించిన తర్వాత ఆ ప్రదేశంలో ఏదైనా రోగ నిరోధక మందును పిచికారీ చేయాలి. కత్తిరించిన భాగాలను పంటకు దూరంగా పడేయాలి.
మొక్కల వేరు వ్యవస్థ 15- 30 సెం.మీ లోతు వరకు వ్యాపిస్తాయి. మొక్కలకు కావాల్సిన సాధారణ వర్షపాతం సంవత్సరంలో తక్కువగా ఉన్నప్పుడు నీటి తడులివ్వడం ముఖ్యం. అందించాల్సిన మోతాదు కంటే ఎక్కువగా నీరు పెడితే మొక్కలను బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధులు ఆశిస్తాయి. తక్కువగా ఇస్తే పండ్ల ఉత్పత్తి సరిగా ఉండదు. నేలలో తగినంత తేమశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలి. నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రదేశాల్లో డ్రిప్ పద్ధతి పాటించొచ్చు.
ఎరువులు మొక్కల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. సేంద్రియ పదార్థం గల ఎరువులను మొక్కలకు అందిస్తే వాటి పెరుగుదల, అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది. ప్రతి మొక్క మొదళ్లలో పశువుల ఎరువు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సూపర్ పాస్ఫేట్, యూరియా వేయాలి. పొటాష్ ఎరువుల వాడకంతో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని మూడు దశల్లో మొక్కల వద్ద వేవాలి.
కలుపు మొక్కల కారణంగా డ్రాగన్ మొక్కలకు నేల నుంచి ఎరువులు అందవు. నీటిని పీల్చుకోలేవు. మొక్కల ఎదుగుదల క్షీణిస్తుంది. మొక్కల చుట్టూ కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. మల్చింగ్ షీట్‌ని పరిచి కలుపు నివారించవచ్చు. లేదా అంతర పంటలూ సాగు చేసుకోవచ్చు. మొక్కలు నాటేముందు నేల వదులుగా అయ్యేంత వరకు దున్నుకోవాలి. నేల తయారీ సమయంలోనేనే పశువుల ఎరువును దుక్కిలో వేయాలి.
మొక్కలు నాటిన ఆరు నెలల నుంచి కాపునకు వస్తాయి. మే, జూన్‌లో పూతకు వచ్చి ఆగస్టు నుంచి డిసెంబర్‌లోపు ఫలాలను ఇస్తాయి. పూత మొదలైన నాటి నుంచి నెల లోపు పండ్లు కోయడానికి వీలుంటుంది. డిసెంబర్ ఒక్క నెలలోనే ఆరుసార్లు పండ్లు కోయడానికి ఆస్కారం ఉంటుంది. పండ్లు పచ్చరంగు నుంచి పింక్ రంగుకు మారగానే పంట కోతకు వచ్చిందని భావించాలి. పండ్లను చేతితో కానీ లేదా కొడవలితో కోయవచ్చు. మంచి దిగుబడి మాత్రం మొక్కలు నాటిన మూడో సంవత్సరం నుంచి పొందవచ్చు. ఒక పండు సరాసరి బరువు 350 గ్రాములు ఉంటుంది. ఒక ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. అన్ని ఖర్చులు పోను రైతుకు తక్కువలో తక్కువ రూ.లక్షల వరకు ఆదాయం వస్తుంది.
ఎర్రగరప, ఇసుక నేలలు, సేంద్రియ పదార్థం గల నేలలు, మురుగునీరు నిల్వ ఉండని నేలలు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనువుగా ఉంటాయి. మొక్కల పెరుగుదలకు సాధారణ వర్షపాతం 50 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఉష్ణోగ్రతలు 20- 30 సెంటిగ్రేడ్ మధ్య ఉంటే సరిపోతుంది. మొక్కల సపోర్ట్‌కు రాళ్లు, కాంక్రీట్ స్తంభాలు, వెదురు స్తంభాలు ఉపయోగించవచ్చు. ఒక్కసారి మొక్క నాటితే అది 30 ఏళ్లపాటు ఫలసాయాన్ని అందిస్తుంది. ఒక్కో మొక్కను 30 సెంమీ, లోతు 20 సెంమీ వెడల్పు కలిగిన గుంతల్లో నాటాలి. గుంతలు తీస్తున్న సమయంలోనే గుంతలోని పక్క భాగాన్నీ కొంచెం వదులు చేయాలి. మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చేసేందుకు వీలుంటుంది. మొక్కలు నాటడానికి ముందుగానే ఏర్పాటు చేసిన స్తంభాలను సరిగ్గా గుంత మధ్యలో పాతాలి. దీంతో మొక్కలు పైకి ఎగబాకడానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒక ఎకరాలో 1700 మొక్కలు నాటవచ్చు. 1 నుంచి 4 మొక్కలను ఒక స్తంభం దగ్గర నాటుకునే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత తక్కువున్న ప్రదేశాల్లో మాత్రం 2- 3 మొక్కలు నాటవచ్చు. తొలకరి జల్లులు కురిసే సమయంలో మొక్కలు నాటితే మంచిది. మొక్కలను మధ్యాహ్నం కాకుండా ఉదయం సాయంత్రాల్లో మాత్రమే నాటాలి.
ఒక్కసారి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు నాటితే 20 ఏళ్ల పాటు ఫలసాయం వస్తుంది. ప్రభుత్వం హెక్టార్‌కు మూడేళ్ల పాటు రైతులకు రూ.1.60 లక్షల సబ్సిడీ ఇస్తుంది. మొదటి మూడు సంవత్సరాల్లో దిగుబడి కాస్త తక్కువగా ఉంటుంది. మూడో సంవత్సరం నుంచి మంచి దిగుబడులు వస్తాయి.
– ఆకుల వేణు, ఉద్యానశాఖ అధికారి, మధిర