రఘునాథపాలెం, నవంబర్ 2 : గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనుల్లో వేగాన్ని మరింత పెంచాలని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునకొల్లు నీరజ అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధిలో భాగంగా ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో కొనసాగుతున్న గోళ్లపాడు కెనాల్ ఆధునీకరణ పనులను కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. ప్రకాశ్‌నగర్, శ్రీనివాసనగర్, ఏఎంసీ మార్కెట్ వెనుక, పంపింగ్‌వెల్ రోడ్డు, రంగనాయకుల గుట్ట, సుందరయ్య పార్క్, కాల్వొడ్డు, ట్రంక్‌రోడ్డు ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించారు.
నిర్దేశించిన ప్రకారం ఫౌంటేన్, చిల్డ్రన్స్ పార్క్ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సుందరయ్య పార్క్‌లో పట్టణ ప్రకృతి వనంలో భాగంగా ఆయుర్వేద, పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఏసీపీ వసుంధర, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.