ఖమ్మం రూరల్, నవంబర్ 2: పంట పొలాల్లో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడమే తరుణోపాయమని వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. బుధవారం కేవీకే సైంటిస్టు డాక్టర్ రవికుమార్, కూసుమంచి ఏడీఏ విజయచంద్రతో కలిసి మండలంలోని ముత్తగూడెం, నర్సింహాపురం గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతువేదికలో ఆయా గ్రామాల రైతులకు సాగులో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హేమంత్‌కుమార్ మాట్లాడుతూ.. వానకాలంలో సాగు చేసిన మిర్చిపంట ప్రస్తుతం పూత,కాత దశలో ఉందన్నారు. ఎండుతెగులు, నల్లతామర, కొమ్మకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లను గమనించామని, నల్లతామర తెగులు పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తెగులు సోకితే నివారణకు బ్యాసియోనా 5గ్రా, లెనిసెలియోలెకాని 5గ్రా లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు. వరి చిరుపొట్ట దశ నుంచి ఈనే దశకు చేరుకున్నదని, ఈ దశలో అగ్గితెగులు, ఆకుమచ్చ, సుడిదోమ వ్యాప్తి ఉంటే నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, సర్పంచ్ గోనె భుజంగరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అనుమోలు రామిరెడ్డి, ఎండీ మౌలానా పాల్గొన్నారు.