కొత్తగూడెం క్రైం, నవంబర్ 2 : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలు నియంత్రించేందుకే జిల్లా వ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. అన్ని ప్రాంతాలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించిన నేపథ్యంలో ఎస్పీ వినీత్ బుధవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ ఆపరేషన్స్ నిర్వహించి అనుమానిత ప్రాంతాలు, ఇళ్లల్లో ఆకస్మిక సోదాలు చేసి నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ శాఖ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సరైన పత్రాలను యజమానులు పోలీస్ అధికారులకు సమర్పించి వాహనాలను తిరిగి పొందవచ్చని పేర్కొన్నారు.
వాహనదారులంతా అన్ని పత్రాలు కలిగి ఉండాలని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా తమ ప్రాంతాల్లో తర్చాడుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీస్ శాఖకు సహరించి తమవంతు బాధ్యత నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహంచే అధికారులు ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.