రఘునాథపాలెం, అక్టోబర్ 28 : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదికైంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన పోటీలను డీవైఎస్వో పరంధామరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టోర్నమెంటు విజేతకు రూ.లక్ష, తరువాతి ఏడు స్థానాల్లో నిలిచిన వారికి తగిన బహుమతులు అందజేయనున్నారు. పూల్స్ వారీగా నిర్వహించే ఈ టోర్నమెంటులో పురుషుల జట్లు 10, మహిళల జట్లు 10 పాల్గొన్నాయి. పురుషుల పూల్ ఏ విభాగంలో మహబూబ్‌నగర్, మెదక్, జట్లు ఉన్నాయి. మహిళల పూల్-ఏ విభాగంలో నల్లగొండ, మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పూల్ బీలో సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ముందుగా పొంగులేటి పుట్టినరోజు కేక్‌ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బెలూన్లను గాల్లోకి వదిలి పోటీలు ప్రారంభించారు.
కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ప్రముఖ వైద్యుడు వై.ప్రసాద్, ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు మలీదు జగన్, దొడ్డా నగేశ్, చావా నారాయణ, మిక్కిలినేని నరేందర్, రామసహాయం నరేశ్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, గుమ్మా రోశయ్య, జ్యోతిర్మయి, పద్మజారెడ్డి, శ్రీకళారెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడో రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల పోటీలు కొత్తగూడెంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ జిల్లాల క్రీడాకారులు పట్టణంలోని పాత డిపో నుంచి ప్రకాశం స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని, ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ప్రతిభ కనపర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా తీసుకొని ప్రతిభ చాటాలని, ప్రతిభకే పట్టం కడతారని అన్నారు.
పెద్దఎత్తున ఈ పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని, ఈ పోటీలకు పీఎస్ఆర్ ట్రస్టు చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారాన్ని అందించడం ఆయనకు క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్పోర్ట్స్ కోటా ఉంటుందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగరేణి జీఎం పర్సనల్ ఆనందరావు, బసవయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జారె ఆదినారాయణ, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, తాండ్ర నాగబాబు, ప్రేమ్, రమేశ్‌బాబు, గోవిందరెడ్డి, అక్బర్, చీకటి కార్తీక్, ముత్తయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.