మధిర, అక్టోబర్ 28: బోనకల్లు, మధిర, దెందుకూరు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నందున ప్రభుత్వం బోనకల్లు, మధిరలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు) నిర్మించింది. బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయిన తర్వాత కొందరు పిల్లర్ల మధ్య ఉన్న స్థలాలను ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు చేశారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీతో పాటు అనుబంధ సంఘాల కార్యాలయాలు నిర్మించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. రహదారులు ఇరుకు మార్గాలుగా మారాయి. రద్దీ ఉన్న సమయంలో పదుల సంఖ్యలో బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయేవి. అలాగే వైరా నుంచి మధిర వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎన్నో ఆక్రమ కట్టడాలు వెలిశాయి. బడ్డీ కొట్లు కొలువుదీరాయి. ఇదే తంతు దశాబ్దాల పాటు కొనసాగుతున్నది. ఆక్రమణలతో ప్రయాణికులకు నిలువ నీడ ఉండేది కాదు. ఎండైతే కాస్త సేద తీరేందుకు నీడ వెతుక్కోవాల్సిందే. వానకాలంలో వర్షంలో తడుస్తూ బిక్కు బిక్కుమనాల్సిందే. ఎంతో మంది ప్రయాణికులు, వాహనదారులు ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ప్రజాప్రతినిధులను కలిసి సమస్య విన్నవించినా స్పందన శూన్యం.
ప్రక్షాళన ఇలా..
ఆక్రమణల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ వీపీ గౌతమ్ ముందుగా వైరా మున్సిపాలిటీపై దృష్టి సారించారు. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను తొలగింపజేశారు. తర్వాత అదనపు కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు మధ్య మధిర, బోనకల్లు ఆర్వోబీల కింద ఆక్రమణలను తొలగింపజేశారు.
చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
ఆర్వోబీల కింద ఆక్రమణల తొలగింపు కారణంగా నష్టపోయిన చిరువ్యాపారుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్‌ను ఇప్పటికే జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కోరారు. సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు స్థలం గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. త్వరలో చిరువ్యాపారుల కోరిక తీరనున్నది.
నేడు ఆహ్లాదం..
బోనకల్లు, మధిర రైల్వే ఓవర్ బ్రిడ్జిల కింద ఆక్రమణల తొలగింపుతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరికింది. బిడ్జిల కింద పిల్లర్ల చుట్టూ పంచాయతీ, మున్సిపల్ అధికారులు చుట్టూ ఫెన్సింగ్ వేసి మినీ పార్క్‌లుగా తీర్చిదిద్దారు. రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. పిల్లర్లకు చిత్రకారులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా బతుకమ్మ, యాదాద్రి దేవాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, సీఎం కేసీఆర్, మిషన్‌భగీరథ, కుల వృత్తిదారులు, తెలంగాణ తల్లి వంటి బొమ్మలు గీయించారు.
ప్రయాణికుల కోసం బస్టాప్‌లు..
ఆర్వోబీల ప్రాంతాలను ఆహ్లాదకరంగా మలచడమే కాకుండా ప్రయాణికుల కోసం అధికారులు మినీ బస్టాప్‌లు ఏర్పాటు చేయించారు. కూర్చునేందుకు సిమెంట్ బల్లాలు ఏర్పాటు చేశారు. బోనకల్లు ఆర్వోబీ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్డి, వాహనదారుల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మధిర ఆర్వోబీ వద్ద ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తూ, ప్రజావసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కేవలం మూడు నెలల్లోనే సమస్యలకు పరిష్కారం చూపిన కలెక్టర్‌ను ప్రజలు అభినందిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపినందుకు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కథ మలుపు తిరిగిన ఘటన ఇదీ..
ఇలాంటి సందర్భంలో కలెక్టర్ వీపీ గౌతమ్ ఓ రోజు తన కాన్వాయ్‌లో మధిర పర్యటనకు బయల్దేరారు. మార్గమధ్యంలోని బోనకల్లు ఆర్వోబీ వద్ద ట్రాఫిక్ సమస్యను గుర్తించారు. కానీ అప్పటికప్పుడు ఏమీ చేయలేకపోయారు. సామాన్యుడిలా ట్రాఫిక్ మధ్యలో వేచి ఉండి, నెమ్మదిగా ట్రాఫిక్‌ను దాటి మధిర వెళ్లారు. ఇదే విధంగా వైరా నుంచి మధిర వెళ్లే మార్గంలో ఆక్రమణలను గుర్తించారు. మధిర ఆర్వోబీ కింద పరిస్థితులను గుర్తించారు. ఆక్రమణల వల్లే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నదని గుర్తించిన కలెక్టర్ వెంటనే ఆర్అండ్బీ పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆర్వోబీ కింద ఉన్న ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెనువెంటనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణదారులు పట్టించుకోలేదు. అధికారులు ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి ఆక్రమణలతో కలిగే ఇబ్బందులను తెలియజేసి బుజ్జగించినా వినలేదు.