తిరుమలాయపాలెం, అక్టోబర్ 28 : ఆంధ్రా పాలకుల పాలనలో నిత్యం కరువు కాటకాలకు నిలయమైన తిరుమలాయపాలెం మండలం స్వరాష్ట్రం వచ్చాక పాలనలో నేడు కోనసీమను తలపిస్తున్నది. ఎటుచూసినా పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన సాగునీటి పథకాలతో మండలంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగునీటి కల్పనతో గత ఐదేళ్లుగా పుష్కలంగా వరి సాగు చేస్తున్న అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. తెలంగాణ ఆవిర్భవానికి పూర్వం జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతంగా తిరుమలాయపాలెం మండలం ఉండేది. ఎలాంటి సాగునీటి వనరులు లేక ఇక్కడి రైతులు వర్షాధార పంటలనే సాగు చేసేవారు. తరుచూ ఏర్పడే వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రాంత ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని దుర్భర జీవితాన్ని గడిపేవారు. డిసెంబర్ నెల వచ్చిందంటే మెట్ట పంటలన్నీ ఎండిపోయ్యేవి. ఈ ప్రాంతంలో వరి సాగుకు అవకాశమే లేక చెరువులు, కుంటల కింద భూములు బీళ్లుగా ఉండేవి.
ఈ తరుణంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంపై ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలుగా మండలంలోని అన్ని చెరువులను బాగు చేసింది. శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిర్మించి పాలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను కరువు నేలలో పారించింది. ఈ పథకం ద్వారా ఐదేళ్లుగా మండలంలోని చెరువులు, కుంటలకు సాగు నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు ప్రతియేటా నీటితో కళకళలాడుతున్నాయి. బావులు బోర్లతో సైతం భూగర్భ జలాలు ఉప్పొంగాయి. దీంతో రైతులు మెట్ట భూముల్లో సైతం మడులు కట్టి వరిసాగు చేస్తున్నారు. మండలంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాధారణ కంటే అత్యధికంగా ఈ ఏడాది 13,400 ఎకరాల్లో వరి సాగు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం కోనసీమగా మారిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంటల సాగు తీరే మారింది..
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వచ్చినంక మా ప్రాంతంలో పంటల సాగు తీరు పూర్తిగా మారింది. గతంలో నీళ్లు లేక మెట్ట పంటలు పెసర, కంది, జొన్న లాంటివి వేసేవాళ్లం. వరి పంట పండేదే కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీరు తెచ్చింది. దీంతో చెరువులు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. బావులు బోర్లలో నీటిమట్టం పెరిగింది. దీంతో వరి పంట సాగుకు అవకాశం కలిగింది. నీటి కరువు తీరింది.
– ఉప్పలయ్య, రైతు, ఏలువారిగూడెం
మెట్ట భూముల్లోనూ వరి సాగు
తెలంగాణ రాకముందు చెరువులు, కుంటలు నెర్రెలు వారేవి. సాగు చేసిన మెట్ట పంటలు ఎండిపోయేవి. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు బాగు చేసింది. పాలేరు చెరువు నుంచి కాల్వల ద్వారా నీళ్లు తెచ్చి చెరువులు నింపుతున్నది. దీంతో ఎక్కడ చూసినా సాగునీటికి కొదువ లేదు. నా మూడెకరాల మెట్ట భూమిలో మడులు కట్టి వరి సాగు చేస్తున్నా. సీఎం కేసీఆర్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేను.
– దడిదల దేవేందర్, రైతు, జల్లేపల్లి