సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది.. ఏటికేడు తన పరిధులను విస్తరించుకుంటున్నది.. ఐటీ రంగానికి నానాటికీ ప్రాముఖ్యత పెరుగుతున్నది.. అంతే వేగంగా ఆ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.. పెద్ద కార్పొరేట్ కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. తాజాగా విడుదలైన ఎంసెట్ -ఇంజినీరింగ్ చివరి విడత అలాట్మెంట్ సీట్లలో ‘సీఎస్ఈ’ వైపే విద్యార్థులు మొగ్గు చూపినట్లు వెల్లడైంది.. బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ కోర్సులకు అంతంతమాత్రంగా సీట్లు భర్తీ అయ్యాయి.
ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 26: ఇంటర్మీ డియట్ అనంతరం ఇం జినీరింగ్ కళాశాలల్లో ప్రవే శానికి ఎంసెట్-2022 కౌన్సి లింగ్ చివరి విడత సీట్ల అలాట్ మెంట్ మంగళవారం ప్రకటిత మయ్యాయి. విద్యార్థులు ఏయే కళాశాలల్లో ఏయే కోర్సుల్లో సీట్లు తెచ్చు కున్నారనే సమాచారం వారికి చేరింది. విద్యార్థులు WWW. TSEAMCET.NIC.IN వెబ్సైట్లో సీటు అలాట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. జేఎన్టీయూహెచ్ పరిధిలో జిల్లాలో ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరిగింది. మొదటి, రెండో విడత కౌన్సిలింగ్లో హాజరుకాని వారితో పాటు సీట్లు మార్చుకునే వారికి ఈ నెల 21 నుంచి ఈ నెల 23 వరకు మూడో విడత కేటాయింపు జరిగింది. ఈ విడత సీట్ల కేటాయింపులో పెద్దగా మార్పులు లేవు. విద్యార్థులు తమకు సీట్లు వచ్చిన కళాశాలల్లో ఈనెల 28లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అత్యధిక కళాశాలల్లో కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు భర్తీ కాలేదు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుం టున్నాయి. ఇంజినీరింగ్‌కి గతంలో క్రేజ్ ఉండేది. నాలుగైదు సంవత్సరాల నుంచి క్రమంగా క్రేజ్ తగ్గుతూ వస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో మాత్రం కొంత ఆశాజనకంగానే ఇంజి నీరింగ్‌లో సీట్లు భర్తీ అయ్యాయి. కొవిడ్ కాలంలో విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో చాయిస్ ఎక్కువగా ఉండడం, సిలబస్ తక్కువగా ఉండడంతో ఉత్తీర్ణతశాతం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎంసెట్ రాసి సర్టిఫికెట్ల పరీశీలనకు హాజరైన విద్యార్థుల సంఖ్య జిల్లాలో 4 వేల మంది వరకు ఉంది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కళాశాలలు అందుబాటులో ఉండగా వాటిల్లో 2 వేలకు పైగా సీట్లు వివిధ కోర్సుల్లో ఉన్నాయి. మంగళవారం ప్రకటించిన సీట్ల కేటాయింపులో మొత్తం 1,154 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్‌తో పాటు కొత్తగా కంప్యూటర్ సైన్స్‌కు అనుబంధంగా రెండు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండోది డేటా సైన్స్ కోర్సులు జిల్లాలోని కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌తో పాటు కంప్యూటర్స్ అనుబంధంగా ఉన్న కోర్సులపై విద్యార్థులు ఆసక్తికనబరుస్తున్నారు. ఆ తర్వాతే ఎలక్ట్రానిక్స్ కోర్సుల వైపు చూస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరం బీటెక్‌లో విద్యార్థులు సీఎస్ఈ కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. సుమారు అన్ని కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ తర్వాత విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఎలక్ట్రికల్ కోర్సులో సింగిల్ డిజిట్‌లోనే సీట్లు భర్తీ కాగా, మెకానికల్, సివిల్ కోర్సుల వైపు మాత్రం విద్యార్థులు చూడనే లేదు. జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో మెకానికల్ కోర్సులో ఒక సీటైనా భర్తీ కాలేదు. ఖమ్మం నగర పరిధిలోని ఓ కళాశాలలో ఏకంగా 298 సీట్లు భర్తీ అయ్యాయి.
ఎంసెట్ చివరి విడతలో సీటు పొందిన విద్యార్థులు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 28వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్ట్‌తో పాటు ఎంచుకున్న కళాశాలలో రిపోర్ట్ చేయాలి. వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. 27 వరకు స్పాట్ అడ్మీషన్స్కు అవకాశం ఉంది.