సత్తుపల్లి/వేంసూరు/కల్లూరు, అక్టోబర్ 26 : చట్టవిరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్ గ్యాంగ్‌లపై దృష్టి సారించాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా కఠినచర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు పోలీస్స్టేషన్లను, ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడారు. నమోదైన ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా ఉండాలని, అందుబాటులోకి వచ్చిన సరికొత్త వెర్షన్ సీసీ టీఎన్ఎస్ 2.0ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సరిహద్దులో పటిష్టమైన నిఘా వ్యవస్థను రూపొందించి గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలకవ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంపొందించడానికి కృషిచేయాలని సూచించారు. సమర్ధవంతమైన పనితీరుతో పెండింగ్ కేసులు తగ్గించేలా చూడాలన్నారు. పోక్సో యాక్టు, క్రైం ఎగనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులకు శిక్షలు పడేలా చార్జిషీటుతో ముందుకు సాగాలన్నారు.
పోలీసుస్టేషన్లో ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్ ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు పోలీసుస్టేషన్లో రిసెప్షన్, పెట్రోకార్స్, కోర్టు డ్యూటీ, సెక్షన్ ఇన్‌చార్జ్‌లపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, కేసుల డిస్పోజల్స్, కన్వెక్షన్లకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.