ముసిరే చీకట్లను తొలగిస్తూ.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తూ.. కుంచితత్వం నుంచి విశాల దృక్పథం వైపు పయనింపజేస్తూ.. మానవాళికి విజయాలు ప్రసాదిస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపుతూ.. ఆనందోత్సాహాలను కలిగిస్తూ కోటి కాంతుల దీపావళి వచ్చేసింది.. ఇంటింటికీ పండుగ తెచ్చేసింది.. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దివాళి వేడుకలు జరుగనున్నాయి.. చిన్నారులు పటాకులు కాలుస్తూ సందడి చేయనున్నారు.. మహిళలు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
– ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 23
ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 23: దీపం అజ్ఞానాంధకారం నుంచి మానవాళిని జ్ఞాన మార్గంలోకి నడిపే సాధనం. చెడుపై మంచి సాధించే విజయం. గోపికలను నరకాసురుడి నుంచి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు. లంకాధిపతి చెర నుంచి శ్రీరాముడు సీతను విడిపించిన రోజు. వీటికి చిహ్నమే దీపావళి. ఆశ్వియుజ అమావాస్య సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకోనున్నారు. చిన్నా పెద్దా అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు.
గగన వీధిలో కాంతి పుంజాలు నింపనున్నారు. పిల్లలు అందంగా ముస్తాబై ఇంటింటా సందడి చేయనున్నారు. పటాకులు కాలుస్తూ సందడి చేయనున్నారు. సోదరులు ఆడపడుచులను ఆశీర్వదించి కట్నకానుకలు అందివ్వనున్నారు. భక్తులు లక్ష్మీదేవిని పూజించనున్నారు. దీపాలు వెలిగించి ఇష్టదైవాన్ని కొలవనున్నారు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వనున్నారు. పిండవంటలు పంచుకోనున్నారు.
బాణసంచా కొనుగోళ్ల జోరు..
ఉభయ జిల్లాల్లో శనివారం నుంచే దీపావళి పండుగ సందడి మొదలైంది. నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలోని మైదానంలో 140 లైసెన్స్ పటాకుల దుకాణాలు వెలిశాయి. శనివారం తొలిరోజు అమ్మకాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఆదివారం అమ్మకాలు ఊపందుకున్నాయి.