మా తల్లిదండ్రులు సుజాతనగర్‌కు చెందిన చంద్రశేఖర్ – జ్యోతి. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య మూడో సంవత్సరం చదుతున్నాను. యుద్ధం ప్రారంభానికి ముందే ఇతర దేశాల వైద్య విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ ఉక్రెయిన్‌లో యుద్ధం వస్తుందని ఇండియన్ ఎంబసీ వారు ముందుగా హెచ్చరికలు జారీ చేయలేదు. అందువల్లనే మేమంతా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 24న కివ్ నుంచి బయల్దేరాం. అదే సమయంలో అక్కడ రష్యా బాంబుదాడి జరిపింది. విద్యార్థులందరూ బంకర్లోకి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఎటునుంచి బాంబు పడుతుందోనని భయంభయంగా గడిపాం. నాతోపాటు తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు రైల్వేస్టేషన్‌కు రాగానే సమీపంలో మళ్లీ బాంబు పడింది. దీంతో రైలు మిస్సైంది. క్యాబ్‌లో విన్సిత్ నగరానికి వెళ్లాం. అక్కడే రెండ్రోజులున్నాం. ఆహారానికి బాగా ఇబ్బంది పడ్డాం. కన్సల్టెన్సీ సాయంతో 420 కి.మీ. ప్రయాణించి రుమేనియాకు చేరుకున్నాం. బార్డర్‌కు 10 కిలోమీటర్ల ముందే మమ్మల్ని దింపేశారు.కానీ బోర్డర్ దాటలేకపోయాం. అనుమతి లేదంటూ రుమేనియా అధికారులు రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. దీంతో బోర్డర్ దాటకుండా ఉండిపోయాం. తెల్లవారిన తరువాత ఇండియన్ ఎంబీసీ వారు అందరినీ పిలిపించి బోర్డర్ దాటించారు. రుమేనియా నుంచి ఢిల్లీకి చేరుకున్నాం. తెలంగాణ అధికారులు మా వద్దకు వచ్చి తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి సౌకర్యాలు కల్పించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కానీ మాతో బయల్దేరిన చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు.
మా తల్లిదండ్రులు రామవరం బేతనియా చర్చి పాస్టర్ కోడూరి డేవిడ్ – విమల. నేను ఉక్రెయిన్‌లోని ఇవానో ఫ్రాక్కీవిస్లోని నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాను. యుద్ధం మొదలవగానే ఆన్లైన్ తరగతులు పెట్టాలని కోరాం. మరుసటి రోజు మేముండే రెండు కిలోమీటర్ల దూరంలో మిస్సైల్ పడింది. బాగా భయపడ్డాం. వెంటనే యూనివర్సీటీ వారు సెలవు ప్రకటించారు. దక్షిణ భారతదేశానికి చెందిన 40 మంది విద్యార్థులం సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించి ప్రొమేనియా సరిహద్దులకు చేరుకున్నాం. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు కాలినడకన రెండు రోజులు నడిచాం. స్వచ్ఛంద సంస్థల వారు మాకు భోజనాలు పెట్టి వసతిని కల్పించారు. బార్డర్ దాటిన తరువాత ప్రొమేనియా ప్రభుత్వం మాకు బస్సు ఏర్పాటు చేసింది. మళ్లీ అక్కడి నుంచి బుచారెస్ట్ విమానాశ్రయానికి చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్న తరువాత ఎయిరిండియా విమానంలో బయల్దేరి గురువారం ఉదయం 6:30 గంటలకు ముంబై విమానాశ్రయంలో దిగాం. అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చాం. ఫిబ్రవరి 26న మొదలుపెట్టిన ప్రయాణం మార్చి 3 వరకు జరిగింది. గురువారం రాత్రి 9 గంటలకు కొత్తగూడెం చేరుకున్నాం. -సాల్మన్, రామవరం