మామిళ్లగూడెం, మార్చి 2: జిల్లాలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద ఉన్న విద్యార్థుల హార్డ్ కాపీలను తక్షణమే ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు అందించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తుల అంశంపై కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 20 కళాశాలల్లో సుమారు 20 వేలకు పైగా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులు వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు సంబంధిత కళాశాలల బాధ్యులతో సమీక్షించి హార్డ్ కాపీలు పెండింగ్, ఆధార్ అథంటికేషన్ పెండింగ్ దరఖాస్తులపై సత్వర పరిషార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్య, ఆర్థిక సంవత్సరాలు ముగుస్తున్నందున పెండింగ్ ఉపకార వేతనాలపై యుద్ధప్రాతిపదికన చర్యల తీసుకోవాలని సూచించారు. సంక్షేమ శాఖల అధికారులు కస్తాల సత్యనారాయణ, కృష్ణనాయక్, జీ.జ్యోతి, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
సరైన సమయంలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. జిల్లాలో క్రీడా అభివృద్ధిపై క్రీడా, విద్యా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. క్రీడా శిక్షణ, క్రీడా పోటీల అవకాశాలు కేవలం నగరానికే పరిమితం కాకూడదని, జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి గ్రామీణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడా ఆసక్తి కలిగిన విద్యార్థులను సరైన సమయంలో ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కేవలం గ్రామీణ క్రీడలే కాకుండా ఒలింపిక్స్ క్రీడల్లో రాణించే విధంగా వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తూ ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల క్రీడా వనరులు అందుబాటులో ఉన్నందున క్రీడాకారుల ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాలన్నారు. అధికారులు పరంధామరెడ్డి, యాదయ్య, జ్యోతి, కృష్ణనాయక్, ప్రత్యూష, ఉదయశ్రీ, కోచ్‌లు, వ్యాయామ టీచర్లు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్‌హసన్ మాట్లాడుతూ ఆటల పోటీల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ఈ నెల 7ను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించాలని కోరారు. అందుకు కలెక్టర్ అనుమతిచ్చారు. ఈ నెల 8న జరిగే మహిళా ఉద్యోగుల ఆటల పోటీలకు అతిథులుగా హాజరుకావాలని వైరా ఏసీపీ స్నేహామెహ్రా, కేఎంసీ మేయర్ నీరజ, డీఆర్వో శిరీష, డీఎఫ్‌వో ప్రవీణ, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, డీసీవో విజయకుమారి, డీఆర్డీవో విద్యాచందనను ఆహ్వానించారు. టీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు.