ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 2: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ యూనివర్సిటీ సాధన సమితి ఏర్పాటైంది. సమితి కన్వీనర్‌గా ఓయూ విద్యార్థి నాయకులు ఎస్.నాగేశ్వర్ రావు, కో కన్వీనర్‌గా ఎస్.సుమంత్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని పొలిటికల్ సైన్స్ విభాగం సెమినార్ హాల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే సాధన సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అనంతరం, వారు సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు గడుస్తున్నా నేటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వర్సిటీ లేకపోవడం బాధాకరమన్నారు. భౌగోళికంగా, విద్యాపరంగా అనువైన ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన పరిశోధనలు జరుగుతాయన్నారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ యూ ని వర్సిటీలు ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లాను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఆమంచి నాగేశ్వర రావు, సీహెచ్ వంశీధర్, గుమ్మడి అనూరాధ, విద్యార్థి నాయకులు నాగేశ్వరరావు, సుమంత్, రుక్మత్ పాషా, అంజి, సంపత్, మేఘన, సిరి, క్రాంతి పాల్గొన్నారు.