ఖమ్మం అర్బన్, జూన్ 16: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కీలకపాత్ర వహించే అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పోస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్న కే.రవికుమార్ తాను ఇక ఈ పోస్టులో కొనసాగలేనంటూ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఆయనను ఆ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర అధికారులు గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నందున ఆ శిక్షణలు పూర్తయ్యాక గత నెల చివరి రోజున ఆయనను ఆ పోస్టు నుంచి డీఈవో రిలీవ్ చేశారు. దీంతో ఆయన వెంటనే వరంగల్ వెళ్లి ఆర్జేడీ వద్ద రిపోర్ట్ చేశారు.
ఆ తరువాత నిబంధనల మేరకు ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గత 16 రోజులుగా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. నిబంధనల మేరకు ఆయనకు ఇవ్వాల్సిన ప్రదేశం కంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో అనేది తెల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారు. ఫలితంగా నేటికీ రవికుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకవైపు అత్యంత ప్రాధాన్యమైన బడిబాట కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతుండగా.. హైస్కూల్ హెచ్ఎం కేడర్‌లో ఉన్న రవికుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
జిల్లాలో ఏఎంవోగా రవికుమార్ రిలీవ్ కాగానే.. సీఎంవోగా పనిచేస్తున్న యలగందుల రాజశేఖర్‌కు ఏఎంవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలోనూ ఈ రెండు పోస్టులు సమర్థవంతంగా నిర్వహించడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు ఖమ్మం డీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఉండగా వైరా మండలానికి చెందిన ఒక హైస్కూల్ హెచ్ఎం ఏఎంవోగా రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పోస్టుకు రావాలంటే రాష్ట్రస్థాయిలో నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ కలిగి ఉండాలి. అయితే, గతంలో నిర్వహించిన రాత పరీక్షలో ఎవరూ ఉత్తీర్ణులు కాకపోవడం గమనార్హం. భద్రాద్రి జిల్లాలో ఏఎంవోగా పనిచేస్తున్న నాగరాజశేఖర్ గతంలో ఖమ్మం జిల్లా ఏఎంవో పోస్టుకు పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు.
కానీ నిబంధనల మేరకు ఇది జిల్లాస్థాయి పోస్టు కావడంతోపాటు అదే జిల్లాకు చెందిన వారే పరీక్ష రాయడానికి అర్హులు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నాగరాజశేఖర్ను అతడి అభిప్రాయం కోరింది. అయితే, తాను భద్రాద్రి జిల్లాలోనే కొనసాగుతానని అతడు రాత పూర్వకంగా సమాధానమిచ్చాడు. అయితే, పక్క జిల్లా వారిని పొరుగు జిల్లా ఏఎంవో పోస్టు నియామక పరీక్షకు ఎలా అనుమతించారనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఏఎంవో పోస్టు ఖాళీగా ఉన్నందున తనకు అవకాశం ఇవ్వాలంటూ వైరా మండలానికి చెందిన సదరు హెచ్ఎం జిల్లాకు చెందిన ఒక మంత్రి సిఫార్సు లేఖతో రంగంలోకి దిగారు.
దీంతో అతడి నియామకం కోసం సదరు ఫైల్‌ను విద్యాశాఖ వర్గాలు ఆగమేఘాలపై సిద్ధం చేశాయి. అంతేగాక రాష్ట్రస్థాయి నుంచి కూడా ఫైల్ త్వరగా పంపాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో డీఈవో కార్యాలయం అతడి నియామకం కోసం ఫైల్‌ను తక్షణమే రాష్ట్ర కార్యాలయానికి పంపింది. ఒకే విద్యాశాఖలో ఒక హెచ్ఎంకు 16 రోజులుగా పోస్టింగ్ ఇవ్వకుండా నత్తతో పోటీపడి పనిచేస్తున్న వ్యవస్థ.. మరో హెచ్ఎం విషయంలో మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఉరుకులు పరుగులు పెడుతుండడం గమనార్హం. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి.