మధిర రూరల్, జూలై 29: మండలంలోని కృష్ణాపురం సమీపంలో ఉన్న బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్లో వంటశాల, డైనింగ్ హాల్, స్టోర్‌రూం, కూరగాయలను పరిశీలించారు.
అనంతరం వంట సిబ్బందితో మాట్లాడుతూ పిల్లలకు భోజనం తయారు చేసేటప్పుడు ఒకటి, రెండుసార్లు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఆ తరువాతనే వంటను సిద్ధం చేయాలన్నారు. డైనింగ్ హాల్, వంట పాత్రలు, ప్లేట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
అనంతరం ప్రిన్సిపాల్, టీచర్లు, సిబ్బందితో మాట్లాడారు. నిరుడు మంచి ర్యాంకులు సాధించినందుకు ప్రిన్సిపాల్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ ఏడాది కూడా మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు. టీచర్లు విద్యాబోధనపై ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేయాలని సూచించారు.