భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిర్వహణలో ఎన్నో మార్పులు వస్తున్నాయని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. అందుకని ఎలక్షన్ విధుల్లో ఉండే సిబ్బంది ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రీ రివిజన్ ప్రక్రియ ఎంతో ముఖ్యమని అన్నారు. అందులో ఎటువంటి పొరపాట్లూ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రీ రివిజన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డీటీలకు కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 1 నుంచి ఎన్నికల సంఘం కొత్త ఫారాలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. వాటిని సక్రమంగా వినియోగించాలని సూచించారు.
ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంటుందని, ఈ ఏడాది నుంచి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. అలాగే సవరణలు, తొలగింపులు, ఆధార్ కార్డుల అనుసంధానం వంటి వాటి కోసం కొత్త ఫారాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ప్రజల్లో ఉన్న అపోహలను కూడా నివృత్తి చేయాలన్నారు. ఆధార్ నెంబర్ వివరాలు ఎన్నికల సంఘం అత్యంత గోప్యంగా ఉంచుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, డీఆర్వో అశోక్‌చక్రవర్తి, తహసీల్దార్లు, డీటీలు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.