మామిళ్లగూడెం/ కొణిజర్ల, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం జరిగే రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ అధికారులకు సూచించారు. అధికారులందరి సమన్వయం, సహకారంతో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలను విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్షల నేపథ్యంలో కొణిజర్ల మండలం తనికెళ్లలోని విజయ ఇంజినీరింగ్ కాలేజ్లో శుక్రవారం నిర్వహించిన అధికారుల సమన్వయ – అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7న సబ్ ఇన్స్పెక్టర్, ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక బోర్డు ప్రకటించిందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా బందోబస్తు, భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మంలోని 17 సెంటర్లలో 7,932 మంది అభ్యర్థులు, సత్తుపల్లిలోని 13 సెంటర్లలో 5,303 మంది అభ్యర్థులు ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరవుతారన్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రకటనలు వంటి వాటితో ట్రాఫిక్కు ఆంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్ష జరిగే సమయంలో సంబంధిత పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణ అధికారులు మినహా పరీక్ష కేంద్రంలోకి మరెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏడీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్, జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ రామచంద్రరావు, , ఏసీపీలు రామోజీ రమేశ్, ఆంజనేయులు, వెంకటేశ్, రెహమాన్, సీఐలు, విజయ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.