కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత దవాఖాన రూపురేఖలే మారిపోయాయి.. కార్పొరేట్‌కు మించిన స్థాయిలో ఇక్కడ వైద్యసేవలు అందుతున్నాయి.. రోజుకు సుమారు వెయ్యి ఓపీ నమోదవుతున్నది.. 94 మంది వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల రుగ్మతలకు చికిత్స అందిస్తున్నారు..
ప్రసూతి విభాగంలోని వైద్యులు నెలకు సుమారు 400 కాన్పులు చేస్తున్నారు. వీటిలో సాధారణ ప్రసవాలే ఎక్కువ. ప్రైవేటు ఆసుపత్రుల కంటే జిల్లా ఆస్పత్రిలోనే ఎక్కువ ప్రసవాలు జరుగుతుండడం ఆస్పత్రి అందిస్తున్న సేవలకు నిదర్శనం. కాయకల్ప నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ వైద్యులు దవాఖానకు ఆదరణను పెంచుతున్నారు. ఏజెన్సీవాసులకు ఈ హాస్పిటల్ వరంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. అధునాతన వైద్యసేవలు కార్పొరేట్ని మించిపోయాయి. ఒకప్పుడు ఏరియా ఆసుపత్రి.. ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ ఐన విషయం విదితమే. ఏకంగా 94మంది వైద్యులు, అన్నిరకాల పరీక్షలు, 12రకాల క్లినికల్ స్పెషలిస్టులు ఆసుపత్రిలో ఉండడంతో రోగుల క్యూ పెరిగింది. రోజుకు సుమారు వెయ్యి మంది వివిధ రకాల రుగ్మతలతో ఆసుపత్రికి వస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గైనిక్ ఆసుపత్రిలో నెలకు 400 కాన్పులకు పైగా జరుగుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే తెలంగాణ) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో ఆధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లోకి మార్పు కావడంతో ఆసుపత్రిలో సౌకర్యాలు బాగా పెరిగాయి. 850మంది ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య 275 మందికి చేరింది.
జనరల్ సర్జరీలే 150 ఉన్నాయంటే ఎందరు సర్జన్లు అందుబాటులో ఉన్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఎముకల విభాగం, చెవిముక్కు, డెంటల్, ఆప్తాలమిక్, పర్మనాలజీ, గైనిక్, ఇతర విభాగాలు వైద్యులు యూజీసీ సమయాలను ఫాలో అవుతున్నారు. 24గంటలు వైద్యసేవలు అందించడంతోపాటు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు షిప్టు డ్యూటీలు కొనసాగుతున్నాయి. 380 పడకల ద్వారా వారికి సేవలు అందుతున్నాయి.
తల్లీబిడ్డల సంక్షేమానికి సర్కారు దవాఖానలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన గైనిక్ ఆసుపత్రి తల్లీబిడ్డల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్నది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రసవాలు మంచిగా చేస్తారో లేదో అని భయపడేవాళ్లు. తెలిసీతెలియని వాళ్లు కాన్పులు చేస్తే బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీసేవారు.
ఇప్పుడు సీన్ మారిపోయింది… ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే తప్పనిసరిగా కోత ఆపరేషన్ తప్పదని నార్మల్ డెలివరీల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కారు ఆసుపత్రులు కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలతో అద్దంలా మెరుస్తున్నాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా కాయకల్ప నిబంధనలను పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు.
దీంతో ఆసుపత్రుల్లో ప్రతి రోగికి నాణ్యమైన సేవలు అందుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడంతో ప్రసవాలకు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రసవాల గదులు తల్లీబిడ్డలతో నిండిపోతున్నాయి. ప్రతి గర్భిణి సాధారణ ప్రసవం అయ్యేవిధంగా ముందునుంచే వారికి అవగాహన కల్పించడంతో తొమ్మిది నెలలు నిండగానే సుఖప్రసవాలతో బిడ్డలకు జన్మనిస్తున్నారు. నార్మల్ డెలివరీలు పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కోత ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ప్రైవేటు కంటే సర్కారు ఆసుపత్రిలోనే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటున్నారు.
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ సాధారణ ప్రసవాలు చేయించుకుని సుఖంగా ఇంటి ముఖం పడుతున్నారు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నది. అమ్మఒడి వాహనంలో తల్లీబిడ్డలను ఇంటికి చేరుస్తున్నారు. గర్భిణులు మొదటి నెల నుంచీ అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం తీసుకుంటూ..సమయానికి టీకాలు వేయించుకొని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రతి మూడు నెలలకు అమ్మఒడి వాహనంలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలతో ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల సాధారణ ప్రసవాలకు దగ్గరవుతున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కా ర్యకర్తలు ఇస్తున్న సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ అమల్లోకి తీసుకురావడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పెరిగింది. దీంతో కాన్పులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. సర్కారు ముద్దు, ప్రైవేటు వద్దు అనేలా గర్భిణులు సర్కారు ఆసుపత్రులకు జై కొడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 15,573 కాన్పులు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రిలో కేవలం 4,875 కాన్పులు మాత్రమే జరిగాయి. గతంలో వేల కాన్పులు ప్రైవేటులో జరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వేల కాన్పులు జరుగుతున్నాయి.
అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. తెలంగాణ రాక ముందు ఆసుపత్రిలో అసలు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడు ఆసుపత్రి రూపురేఖలే మారిపోయాయి. జిల్లా కేంద్రంగా డయాగ్నస్టింక్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎక్కడ రక్త పరీక్ష చేయించుకోవాలన్నా పరీక్షకు రక్తం ఇస్తే చాలు వారి సెల్‌ఫోన్‌కు పరీక్ష రిజల్ట్ వస్తున్నది.
ప్రధాన ఆసుపత్రి మెడికల్ కాలేజీగా మారడంతో స్పెషలిస్టు డాక్టర్స్ పెరిగారు. మంచి వైద్యం అందుతున్నది. సర్జరీలు బాగా చేస్తున్నారు. అన్ని విభాగాలకు వైద్యులు ఉన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. త్వరలో సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏ పరికరం కావాలన్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
– డాక్టర్ లక్ష్మణస్వామి, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్