భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ) జూలై 29: గోదావరి వరదల కారణంగా ముంపు ప్రాంతవాసులు నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. వారి పునరావాసానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. వసతుల కల్పన చేపడుతున్నది. మరోవైపు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. తాజాగా వందలాది మంది బాధితులకు నిత్యావసర సరకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. నిత్యావసర కిట్లు సిద్ధం చేశారు. వాటిని శనివారం మంత్రి అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు.
కార్యక్రమాలకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం, 11 గంటలకు అశ్వాపురం, 12 గంటలకు నెల్లిపాక బంజర, 1 గంటకు బూర్గంపాడు నిత్యావసరాలు పంపిణీ చేస్తారు.