చినుకు రాలితే చాలు.. వాగులు వంకలు ఉప్పొంగుతాయి.. రహదారిపైనే వరద ప్రవహిస్తుంది. వానల తీవ్రత ఎక్కువగా ఉంటే ఇక మూడు నాలుగు రోజుల పాటు జల దిగ్బంధమే.. అత్యవసర సమయాల్లో వాగులు దాటడమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమే.. ఒక్కోసారి వాహనాలు కొట్టుకుపోయేవి.. కొన్నిసార్లు మనుషులే గల్లంతయ్యేవారు.. గర్భిణులకు సరైన సమయంలో వైద్యం అందక మరణించిన వారెందరో..! ఇదీ ఇల్లెందు నుంచి గుండాల వెళ్లే ఏజెన్సీవాసుల అవస్థలు. 60 కిలోమీటర్ల ప్రయాణం వారికి ఒక ప్రహసనం..
మరి నేడు. రాష్ట్ర ప్రభుత్వం 60 కిలోమీటర్ల మధ్య ఏకంగా 30 వంతెనలు నిర్మించింది.. రహదారిని విస్తరించింది.. గతంలో ఐదు గంటలు పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం గంటన్నరే పడుతున్నది. ఏజెన్సీవాసుల ప్రయాణాన్ని సునాయాసం చేసింది.. ఈ ప్రగతి ‘మార్గం’పై కథనం.
ఇల్లెందు, జూలై 29: ఇల్లెందుకు 60 కిలోమీటర్ల దూరంలో గుండాల ఉంటుంది. మార్గంపొడవునా దట్టమైన అడవి ఉంటుంది. వాగులు, వంకలు, ఒర్రెలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో సుమారు 60 వేల జనాభా ఉంటుంది. వాళ్లందరికీ వారి గ్రామాలు చేరుకోవడానికి ఇల్లెందు దారే ప్రధాన రహదారి. వారికి ఎలాంటి అవసరం వచ్చినా ఇల్లెందు పట్టణమే ఆధారం.
విద్య, వైద్యం, సామగ్రి అన్నింటికీ ఇల్లెందు రావాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే అక్కడి ప్రజలకు ఇబ్బందే. కొద్దిపాటి వర్షానికే వాగులు పొంగి పొర్లుతాయి. మామకన్ను వద్ద చిన్నవాగు, బూడిదవాగు, లోతువాగు, ముత్తాపురం వద్ద నిమ్మవాగు, పడుగోనిగూడెం వద్ద పాలగొర్రె , కాచనపల్లి అడవుల్లోని కిష్టాపురం తోగు వాగులు రహదారిపైన పొంగిపొర్లుతాయి. కొన్నిసార్లు వాహనాలు వాగులపై ఆగిపోయేవి.
నలుగురు కలిసి తోయాల్సి వచ్చేది. కొన్నిసార్లు వాహనాలు కొట్టుకుపోయిన సందర్భాలూ ఉన్నాయి. నాటి పాలకులు రహదారి, వంతెనల విషయాన్నే పట్టించుకోలేదు. ఏజెన్సీవాసులపై దయచూపలేదు. నాటి కలెక్టర్, ఉన్నతాధికారులకు అనేకసార్లు రోడ్లు నిర్మించాలని వినతులు ఇచ్చినా అవి బుట్టదాఖలయ్యాయి.
వంద గ్రామాలు.. రెండు మండలాలు.. వేలాది మంది జనాభా. అంతా ఏజెన్సీవాసులే.. వానకాలంలో అక్కడికి చేరుకోవాలంటే పెద్ద ప్రహసనమే. వాగులు, వంకలు దాటి ప్రయాణించాలి. మార్గం పొడవునా దట్టమైన అడవులు, గుట్టలు. ఆపద వస్తే సరైన రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. నాటి పాలకులు ఏజెన్సీవాసుల కష్టాలను పట్టించుకోలేదు.
వర్షాకాలం వచ్చిందంటే వాగులు పొంగి పొర్లడం, రోడ్డంతా బురదమయం కావడం, మార్గం పొడవునా మోకాటిలోతు గుంతలు ఉండడంతో గుండాల ప్రయాణం కష్టతరంగా ఉండేది. ఇల్లెందు నుంచి గుండాల వెళ్లాలంటే సాధారణంగా గంట సమయం పడుతుంది.
కానీ వర్షాకాలంలో ఐదు గంటలు పట్టేది. ఉదాహరణకు ఖమ్మం నుంచి హైదరాబాద్కు నాలుగు గంటల ప్రయాణం. ఇంతకంటే ఎక్కువ సమయం ఇల్లెందు నుంచి గుండాలకు వెళ్లడానికి పడుతుందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వాహనాలు నడిపేవారు వాహనం ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ పల్టీ కొడుతుందో తెలియక ఆందోళనకు గురయ్యేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఏజెన్సీలకు రహదారి సౌకర్యం వచ్చింది. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పల్లె జనాల్లో ఉత్సాహం మొదలైంది. ప్రభుత్వం 60 కిలోమీటర్ల రహదారిపై 30 బ్రిడ్జిలు నిర్మించింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల ప్రజల కష్టాలు తీర్చింది.