రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధిలో నమూనాగా నిలుస్తున్నది.. సీఎం కేసీఆర్‌తోనే ఖమ్మం రూపురేఖలు మారాయి.. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి” అని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం నగర పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి రూ.100 కోట్ల విలువైన పల్లె, పట్టణ ప్రగతి, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
అనంతరం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో తొలుత వారు ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గత పాలకులు ఖమ్మం పట్టణాన్ని మురికి కూపంగా మార్చారని ఆరోపించారు. నగరాభివృద్ధిపై మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేశారని ప్రశంసించారు.
రాష్ట్రంలోనే నెం.1 కార్పొరేషన్‌గా ఖమ్మం నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అజయ్‌కుమార్ సైకిల్‌పై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారని కొనియాడారు. బీజేపీ పార్టీ పచ్చగా ఉండే భారతదేశంలో కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి చలిమంటలు కాగి ఓట్లు రాబట్టుకోవాలనే నీచమైన ఆలోచనలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు లేనిపోని పంచాయితీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసేలా చిల్లర, మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధిలో నమూనాగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వంకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం నగర పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి రూ.100 కోట్ల విలువైన పల్లె, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.
అనంతరం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గత పాలకులు ఖమ్మం పట్టణాన్ని మురికి కూపంగా మార్చారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేశారని ప్రశంసించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైకిల్‌పై లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మంత్రి అజయ్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రజలు పన్నుల రూపేనా కేంద్రానికి రూ.3,65,797 లక్షల కోట్లు చెల్లించారన్నారు.
కానీ కేంద్రం మాత్రం రాష్ర్టానికి కేవలం రూ.1.68 లక్షల కోట్ల నిధులను మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. మనకు రావాల్సిన నిధులను బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేటాయిస్తున్నదన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం రాష్ర్టానికి వచ్చి తెలంగాణకు అంతిచ్చినం..ఇంతిచ్చినం అని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పొలిటికల్ టూరిస్టుల్లా ఢిల్లీ నుంచి నాయకులు ఇక్కడికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే కాషాయ నేతలు విద్వేషాలను రగిలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో గొంతు విప్పలేదన్నారు. ఏడు మండలాలను పక్కరాష్ట్రంలో కలిపినప్పుడు, లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని విలీనం చేసినప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడూ గొంతు విప్పలేదని ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టమని కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రం బాగుపడిందన్నారు. సభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, అజ్మీరా వీరూనాయక్, మందడపు నర్సింహారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అజయ్‌కుమార్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా పన్నాగం పన్నారు. శవాలపై పేలాలు ఏరుకునే దౌర్భాగ్యానికి బీజేపీ నాయకులు దిగజారారు. అన్ని రంగాల్లో నగరం నంబర్ వన్‌గా నిలుస్తున్నది. 2014కు ముందు ఖమ్మం నగరం ఉందో.. తెలంగాణ వచ్చినంక నగరం ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలి.
మొన్న వరంగల్ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చిండు. ఒక్కఛాన్స్ ఇవ్వండి అంటూ చిలక పలుకులు పలికిండు. ఆయన ముత్తాత నుంచి మొదలు పెడితే నాయనమ్మ, తండ్రి, తల్లి వరకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. చేతికి అధికారం ఇస్తే వారు. దేశానికి చేసిందేమిటి ? రైతులకు రైతుబీమా ఇవ్వలేనోళ్లు, సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపలేనోళ్లు, తాగునీటితో ప్రజల గొంతులు తడపలేనోళ్లను ప్రజలు ఎట్లా ఆదరిస్తరు. ప్లీజ్.. ప్లీజ్.. అని ప్రజలను అడిగితే తాంబూలం, లవంగం, ఒక్కపొడి ఇస్తారు తప్ప అధికారం ఇవ్వరు.
పచ్చగా ఉండే భారతదేశంలో బీజేపీ నాయకులు కులం, మతం పేరుతో చిచ్చుపెడుతున్నారు. ఆ చిచ్చులో చలిమంటలు కాగుతున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన చేస్తున్నారు. కాషాయ నేతల అనుచిత వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లపైకి వస్తున్నారు. ఏ దేవుడూ కులం, మతం పేరుతో చంపుకోండని చెప్పలేదు. ఖురాన్, భగవద్గీత, బైబిల్లో ఎక్కడా అలా లేదు. 1987లో భారతదేశం, చైనా ఆర్థిక పరిస్థితి 470 బిలియన్ డాలర్లతో సమానంగా ఉండేది. 35ఏళ్ల తరువాత చైనా 16 ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకెళ్లింది. కానీ భారతదేశం మాత్రం 3 ట్రిలియన్ డాలర్ల వద్దనే ఆగిపోయింది. మన కంటే చైనా 5.78 రెట్లు అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా ఇప్పుడు అమెరికా తరువాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక చోదక శక్తి. కానీ బీజేపీ పాలనలో ప్రస్తుతం దేశం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలు గమనించాలి.
ఖమ్మాన్ని అభివృద్ధి గుమ్మంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. గత పాలకుల హయాంలో కరెంటు ఉంటే వార్త అయ్యేదని, సీఎం కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త అవుతోందని అన్నారు. పాలనాదక్షుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణలో త్వరతిగతిన అభివృద్ధి సాధ్యమైందని, ఇందుకు ఖమ్మంలో జరిగిన అభివృద్ధే నిదర్శనమని అన్నారు. ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఇక్కడి ప్రజలు అభివృద్ధి ఫలాలు అందుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తరువాత ఖమ్మం అభివృద్ధి గుమ్మంగా మారింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏటా మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. గొంగళి పురుగుగా ఉన్న నగరాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సీతాకోకచిలుకలా మార్చాం. నగరం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కొందరు అడ్డంకులు సృష్టించి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ఒకప్పుడు మురికికూపంగా ఉన్న లకారం చెరువును ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుకున్నాం. కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. రూ.130 కోట్లతో టేకులపల్లిలో కేసీఆర్ టవర్స్ పేరుతో 1,250 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాం. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం. నగరం నడిబొడ్డున ఐటీ హబ్ నిర్మించాం. యువతకు ఉపాధినిస్తున్నాం. రూ.77 కోట్లతో ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాం. రూ.35 కోట్లతో వి.వెంకటాయపాలెం వద్ద నూతన కలెక్టరేట్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులతో ప్రజల ఆస్తుల రేట్లు 3-4 రెట్లు పెరిగాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10కి 10 సీట్లు గెలుచుకుంటాం.
-రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించింది. సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రాజెక్టులు నిర్మించింది. చెరువులను పటిష్టం చేసింది. ఇప్పుడు వేసవిలోనూ చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జలకళను సంతరించుకున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదు. ఆయా పార్టీలకు ప్రజల సమస్యలు పట్టవు. రాష్ట్రం నుంచి ప్రతి రూపాయిలో మూడోవంతు డబ్బు కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్నది. కేంద్రం నుంచి మాత్రం మనకు నిధులు రావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారు.
-టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు
‘కే ఫర్ కాలువలు, సీ ఫర్ చెరువులు, ఆర్ ఫర్ రిజర్వాయర్లు’.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే గ్రామాల్లో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, నర్సరీలు ఏర్పాటు చేశారు. ఊరికో ట్రాక్టర్, ట్యాంకర్ కేటాయించారు. ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. నాడు రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త.. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి అభివృద్ధికి ఆస్కారమే లేదు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెడ్లకు పగ్గాలిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, రెడ్లు ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తామంటున్నడు.. కులాన్ని ప్రేమించే నాయకుడికి ఓట్లేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడే తప్ప సమాజానికి కాడు. ఇంకో మత పిచ్చోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మసీదులు తవ్వుదాం అంటడు. మసీదులు తవ్వడానికా ప్రజలు నిన్ను ఎంపీని చేసింది? విధ్వంసం తప్ప నిర్మాణాలపై బండి సంజయ్‌కు సోయి లేదు. పరమత సహనం లేని నాయకుడిని ప్రజలు ఎట్లా గౌరవిస్తరు?
– మంత్రి కేటీఆర్