మామిళ్లగూడెం, జూన్ 11: యువనేత, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో రూ.100 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఉదయం 10 గంటలకు మమత వైద్య కళాశాల మైదానానికి చేరుకున్న ఆయనకు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి స్వాగతం పలికారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, నగర మేయర్ పునుకొళ్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కొత్తగూడెం, పాలేరు, వైరా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ చంద్రావతి, మదన్‌లాల్, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఆర్జేసీ కృష్ణ, మద్దినేని స్వర్ణకుమారి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించారు. ముందుగా గొల్లగూడెం ప్రాంతంలోని శ్రీఅష్టలక్ష్మి ప్రతిష్ఠా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలోని చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్,అజయ్‌కుమార్ ప్రారంభించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్లో రూ.8.75 కోట్లతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి, రూ.98.50 లక్షలతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేన్ ఎండ్ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన సుడా పార్, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. తరువాత ఖమ్మం టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్ నందు రూ.14.84 కోట్లతో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను, రూ.16 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం(టీకేపీ) పట్టణ ప్రకృతి వనాలను ప్రారంభించారు.
అక్కడి నుంచి సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులకు రానున్న కాలంలో చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఖమ్మం పాత మున్సిపల్ భవనంలో ఏర్పాటు చేసిన సిటీ సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రూ.1.09 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునాతన పుట్‌పాత్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అనంతరం గట్టయ్య సెంటర్ నందు రూ.22కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం ప్రకాశ్‌నగర్ మున్నేరు బ్రిడ్జి వద్ద రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అనంతరం హెలికాప్టర్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ బయల్దేరారు.
రఘునాథపాలెం, జూన్ 11: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. తెలంగాణ సాంస్కృతిక విభాగ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తన ఆటపాటలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. సభా ప్రారంభానికి ముందు సాయిచంద్ పాటలు పాడి ఉత్సాహం నింపారు. మంత్రి కేటీఆర్ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.