ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 11 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం జరగనున్నది. పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లా పరిధిలో పేపర్-1, 2 పరీక్షకు కలిపి 33,518మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్-1 పరీక్షను ఉదయం, పేపర్-2ను మధ్యాహ్నం నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షను డీఈడీ అభ్యర్థులు రాస్తుండగా, పేపర్-2 పరీక్షను బీఈడీ అభ్యర్థులు రాయనున్నారు. డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు పోటీ పడుతుండగా, పేపర్-2 వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు.
ఉదయం జరిగే పేపర్-1పరీక్షకి 78 కేంద్రాలు, పేపర్-2 పరీక్షకి 64కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్షకి 18,514 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, పేపర్-2కు 15,004 మంది హాజరవుతున్నారు. ఉదయం, సాయంత్రం జరిగే పరీక్షలకు సంబంధించి 142కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్-2 మధ్యా హ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.
పరీక్ష ఏర్పాట్లను ఖమ్మం డీఈవో కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, అర్బన్ తహసీల్దార్ శైలజ డీఈవో యాదయ్యతో కలిసి పరిశీలించారు. పలు విభాగాలకు చెందిన నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఇన్విజిలేషన్ విధులు కేటాయించారు.
టెట్ పరీక్షకు ఖమ్మం జిల్లా అబ్జర్వర్‌గా విద్యాశాఖ సమగ్రశిక్ష అభియాన్ అడిషనల్ డైరెక్టర్ జీ రమేశ్‌ను ప్రభుత్వం నియమించింది. శనివారం రాత్రి ఖమ్మం చేరుకున్న ఆయన ఆదివారం పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను పరీశీలించనున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యాశాఖాధికారులతో సమావేశమై చర్చించనున్నారు.
టీఎస్ టెట్-2022 పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావ్ తెలిపారు. రోజువారీగా ఆయా రూట్లలో తిరుగుతున్న బస్సులతోపాటు అదనంగా 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
జిల్లాలో జరుగనున్న టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఆర్డీవో స్వర్ణలత తెలిపారు. శనివారం కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్టికెట్లలో వెనుక వైపు ఉన్న నిబంధనలు తప్పక పాటించాలన్నారు. వారితోపాటు తహసీల్దార్ స్వామి, ఎంఈవో శ్రీరాంమూర్తి ఉన్నారు.
జిల్లాలో మొత్తం 16,747 మంది అభ్యర్థులు 40 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. కొత్తగూడెంలో 15, పాల్వంచలో 9, ఇల్లెందులో 6, భద్రాచలంలో 6, మణుగూరులో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8రూట్లలో రూట్ ఆఫీసర్లుగా తహసీల్దార్లను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.