ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందుకని పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని, పార్టీ పటిష్టతకు పెద్ద ఎత్తున కృషి చేయాలని సూచించారు. శనివారం ఖమ్మంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు.
వచ్చే శాసన సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలనూ పార్టీ గుర్తిస్తుందని, వారి సేవలను వినియోగించుకుంటుందని అన్నారు. ప్రతి అంశంలో పోలీసుల జోక్యం ఉండకుండా చూడాలని, రాజకీయంగా పోలీసుల వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ అవతరించనున్నదని, దేశ ప్రజలు సైతం కేసీఆర్ పాలనాదక్షతపై దృష్టి సారించారని అన్నారు. పోలీసుల వినియోగాన్ని నివారించకపోతే సాధారణ ప్రజలు దూరమవుతారని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుభవాలను పార్టీ కోసం వినియోగించుకుంటామన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి సైతం పదవులు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇస్తామని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టతపై మరోసారి హైదరాబాద్‌లో అందరితో విస్తృతస్థాయిలో సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీ పరంగా, పదవుల పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు పెద్దపీట వేస్తున్నారని, ఇందుకు నిదర్శనంగానే జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కలిగిందని గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గాయత్రి రవి, పార్థసారథిరెడ్డిలకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాఘతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచే గుర్రాలకే సీట్లు కేటాయిస్తామని, జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం, పాలేరు, అశ్వారావుపేట, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియా నాయక్, టీఎస్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం, భద్రాద్రి జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.