లక్ష్మీదేవిపల్లి, జూన్ 10: అత్యవసరంగా నగదు కావాలంటే ఇంతముందు బ్యాంకుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకునే వాళ్లం. ఆ ఆభరణాలను అప్రైజర్ తనిఖీ చేసి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పూర్తయి లోన్ అమౌంట్ చేతికి వచ్చే సరికి కనీసం ఒకరోజైనే సమయం పట్టేది. కానీ ఇప్పుడు వేరు. యాప్స్‌లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే చాలు.. ఇన్‌స్టంట్‌గా లోన్ అమౌంట్ మన బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఇలాంటి యాప్స్ ఇప్పుడు ఆన్లైన్లో లెక్కకు మిక్కిలి ఉన్నాయి.
దీంతో పర్సనల్ లోన్స్ అయినా, అత్యవసర లోన్స్ అయినా ఇట్టే లభిస్తున్నాయి. కానీ చిక్కులు కూడా అంతకుమించి ఉంటున్నాయి. లోన్ అమౌంట్, ఇన్స్టాల్మెంట్ సకాలంలో చెల్లించినప్పటికీ సదరు యాప్‌లలో సక్రమంగా అప్డేట్ కావడం లేదు. దీంతో అమౌంట్ ఇంకా చెల్లించలేదంటూ సంస్థ బాధ్యులు రుణగ్రహీతలకు ఫోన్లు చేస్తుంటారు.
ఒక్కోసారి లోన్ మొత్తం చెల్లించినా ఇంకా చెల్లించలేదంటూ మళ్లీ మళ్లీ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. దీంతో రుణగ్రహీతలు విలవిలలాడిపోతున్నారు. ఆ వేధింపులతో ఒక్కోసారి అధిక మొత్తం కూడా కడుతున్నారు. అయినా ఆగకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి యాప్‌లతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇన్స్టంట్ యాప్ పేరుతో అవసరమైన డబ్బులు ఇస్తామంటూ మెసేజ్‌లు చేస్తారు. అత్యవసరమైన వారు ఈ యాప్‌లో డబ్బుల కోసం అప్లయి చేసుకుంటారు. అయితే ఆ సమయంలో వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి సమాచారం అందించాల్సి ఉంటుంది. రుణగ్రహీత రూ.4,500 లోన్ తీసుకుంటే వారం రోజుల్లో రూ.5,700 చెల్లించాల్సి ఉంటుంది. రుణగ్రహీత ఆ మొత్తాన్ని వారం రోజుల్లోపే చెల్లించాలని ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు.
ఒప్పందం ప్రకారం రుణగ్రహీత సకాలంలో లోన్ మొత్తాన్ని చెల్లించినా ఆ వివరాలను యాప్ నిర్వాహకులు సకాలంలో తమ వద్ద అప్డేట్ చేయడం లేదు. పైగా గడువు దాటినా రుణం చెల్లించలేదంటూ రుణగ్రహీతలకు ఫోన్లు చేస్తుంటారు. ఇప్పటికే చెల్లించామని రుణగ్రహీత సమాధానం చెప్పినా.. చెల్లిస్తే తాము ఎందుకు ఫోన్ చేస్తామంటూ ఎదురు ప్రశ్నిస్తారు.
తాము తీసుకున్న రుణం మొత్తం చెల్లించినా, చెల్లించకపోయినా మానసికంగా వేధించడం, స్నేహితుల వద్ద పరువు తీయడం వంటి చర్యలకు సైతం దిగుతున్నాయి ఈ ఇన్స్టంట్ లోన్ యాప్ సంస్థలు. సదరు వ్యక్తి తమకు లోన్ చెల్లించలేదంటూ రుణదాత ఫ్రెండ్స్ మెసేజ్‌లు పంపుతారు. వాటిని సోషల్ మీడియాలోనూ పోస్టు చేస్తారు. ఇంకా అసభ్యకరమైన పోస్టులు, మెసేజ్‌లు చేస్తారు. రుణగ్రహీత పరువు తీసేలా చేస్తుంటారు.